
కిరణ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరి బాల్ సిద్ధం చేసుకుంటున్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరి బాల్ సిద్ధం చేసుకుంటున్నారు. అసెంబ్లీలో తన ప్రసంగం ముగియగానే సిఎం పదవికి ఆయన రాజీనామా చేస్తారని తెలుస్తోంది. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేస్తారని జాతీయ మీడియా కథనం. పదవికి రాజీనామా చేయడమే లాస్ట్ బాల్గా చెబుతున్నారు.
పైకి సమైక్య వాదం, లోపల అవకాశవాదం... ఇదీ కిరణ్‌కుమార్ ఎజెండానా.? అవునంటున్నాయి జాతీయ ఛానళ్లు. అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం ఫస్ట్ ఎపిసోడ్ నిన్న చదివేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్.. ఇవ్వాళ రెండో ఎపిసోడ్ చదవనున్నారు. గడువు గురించి రాష్ట్రపతి ఏమి తేల్చకపోవడంతో ఇవ్వాళ రెండో ఎపిసోడ్ అయిపోగానే.. కిరణ్‌కుమార్ తన లాస్ట్ బాల్ విసురుతారట. లాస్ట్‌బాల్ అంటే మరేంటో కాదు.. తన ప్రసంగం ముగియగానే కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారట. ఇదే విషయాన్ని ఐబీఎన్ గ్రూప్ తన వెబ్‌సైట్లో బయటపెట్టింది.
ఇన్నాళ్లు తెర వెనక పార్టీ పనులు పురమాయించిన కిరణ్.. ఇక పదవికి గుడ్‌బై చెప్పి ఎన్నికలకు సిద్ధమవుతారట. ఈ లెక్కన ఇన్నాళ్లు సమైక్యమంటూ చేసిన వాదనలు.. కేవలం రాజకీయ అవకాశవాదం కోసమేనని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు. ప్రసంగం ముగియగానే సభలోనే రాజీనామా ప్రకటించడం, అనంతరం సభ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని ప్రకటించడం.. ఇదీ ఇప్పుడు సీఎం ఎజెండా అంటున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టంగా భావిస్తున్నానంటూ నిన్న చేసిన స్పీచ్ కూడా దీనికి ఇండికేషన్ అని చెబుతున్నారు. ఇవన్నీ పక్కనబెడితే.. సీఎం కిరణ్ రేపు ఢిల్లీ వస్తారని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. అంటే కొత్త పార్టీ పెట్టడం కూడా హైకమాండ్ స్ట్రాటజీలో భాగమేనన్నమాట...!
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టంగా భావిస్తున్న సీఎం కిరణ్... తరువాత ఏంటి? సమైక్యమో... కాంగ్రెస్ పార్టీనో తేల్చుకునే పరిస్థితి వస్తే... ఆయన ఎటు మొగ్గు చూపుతారు? సుదీర్ఘ ప్రసంగానికి సిద్ధమైన కిరణ్... ప్రసంగం ముగియగానే రాజీనామా చేస్తారా? సీఎం కిరణ్ వ్యూహమిదేనని జాతీయ మీడియా అంటోంది. సీఎం విసిరే లాస్ట్ బాల్ రాజీనామానేనని ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేసిన వెంటనే కొత్త పార్టీని ప్రకటిస్తారని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే మరో వైపు కిరణ్ రేపు ఢిల్లీ వస్తారని దిగ్విజయ్ సింగ్ చెబుతున్నారు.