
ఆఖరి బంతి మిగిలే ఉంది
సమైక్య ఛాంపియన్...! ఇంకా ఆట ముగిసిపోలేదు...!! ఆఖరి బంది మిగిలే ఉంది....!!అని చెప్పుకుంటూ చివరి క్షణం వరకు సీఎం కుర్చీలో కొనసాగిన కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆఖరు బంతి అంటే చివరి వరకు అధికారంలో కొనసాగడమేనన్న విమర్శలు రావడంతో... విభజన జరిగినట్లు కాదు. ఇంకా చాలా తంతు ఉంది...! అని చెబుతూ ఆట ఇప్పుడే ప్రారంభమైందన్న రీతిలో కొత్త పార్టీ గురించి వివరించడం మొదలుపెట్టారట. ఆయన కొత్త పార్టీతో ఇంకా ఆట మొదలు కాకముందే ఒక వికెట్ కోల్పోయింది. నేనొస్తానంటూ చెప్పిన కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ ఒకరు ఆయన టీమ్లో చేరకుండానే బ్యాట్ కింద పడేశారు.
టీమ్ లో ఒకరు లేనంత మాతాన ఆట ఆగదని మొదలు పెట్టిన లీడర్ తొలి వ్యాఖ్యలే మిగతా ఆటగాళ్లను నీరసపరిచాయట. ఇంకా మైదానంలోకి దిగకముందే ఆట ఎందుకు ఆడబోతున్నామో కిరణ్ చెప్పిన మాటలు క్రీడాకారులను (ఆ పార్టీలో చేరిన నేతలు)దిమ్మదిరిగేలా చేశాయట. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ ప్రజలు నోటా (పైవారెవరూ కాదు) బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారంతా మాకు ఓటు వేయాలి...అని కిరణ్ పిలుపిచ్చారు. ఓహో... ఇదేదో బాగుందే అని ఆ పార్టీలో చేరిన ఒక కొత్తనేతకు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ఇటీవల ఢిల్లీ, మధ్యప్రదేశ్్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో తొలిసారి ఈవీఎంలో నోటా ప్రవేశపెట్టగా, అనేక చోట్ల నోటా మీట నొక్కిన వారు వందల్లో మాత్రమే ఉన్నారని తెలిసి.... మా పరిస్థితి అంతేనా అని సణుక్కున్నారు.