మళ్లీ వేసవి వస్తోంది. భానుడి భగభగలు మళ్లీ మొదలు కానున్నాయి. వాతావరణ సమతుల్యత లోపించడంతో వడగాలుల ప్రభావం తప్పేలా లేదు. మళ్లీ కొన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదమూ లేకపోలేదు. ఇది ప్రకృతి సహజమే. కానీ వారిపై కుటుంబాలను ఆదుకోవాల్సిన సర్కారు మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. రెండేళ్లుగా వారికి పరిహారం ఇస్తామని చెప్పి మొండి చెయ్యి చూపింది. మరో వేసవిని ఎదుర్కోనున్న తరుణంలో పాతవాటిపై సర్కారు ఏమంటుందో...
విజయనగరం గంటస్తంభం: వేసవి కాలంలో ఎండల తీవ్రత తట్టుకోలేక వడదెబ్బకు మృతి చెందిన వారిపై ఆధారపడిన కుటుం బాలకు ప్రభుత్వం రూ. లక్ష వంతున పరిహారం ఇస్తామని ప్రకటించిన విషయం విదితమే. కానీ రెండేళ్లుగా ఎవరికీ పరిహారం అందకపోవడం ఇప్పుడు చర్చనీయాం శం. 2015 సంవత్సరంలో 149మంది మృతి చెందగా అధికారుల ధ్రువీకరణ తర్వాత కొందిరికి మాత్రం పరి హారం ఇచ్చారు. 2016లో 115 మంది మృతి చెందగా ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేదు. అధికారుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినా కనీసం పట్టించుకోలేదు. 2017 వేసవిలో 80 మంది వరకు మృతి చెందినా అధి కారిక లెక్కలు మాత్రం 38మందిగానే నమోదయ్యాయి. వారికీ పరిహారం లేదు.
అధికారులు నిర్ధారించినా...
వడడెబ్బ కారణంగా మృతులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం త్రీమన్ కమిటీని నియమించింది. తహసీల్దారు, పీహెచ్‌సీ వైద్యులు, ఎస్‌ఐ నిర్ధారించిన తర్వాత పరిహారానికి సిఫార్సు చేయాలని సూచించింది. ఈ కమిటీ 2015లో 216 మంది మృతి చెందితే వడపోసి తక్కువ మందికి ఇచ్చింది. అదే కమిటీ 2016లో 115మందికి, 2017లో 37మందికి సంబంధించి పరిహారానికి కలెక్టరేట్‌కు ప్రతిపాదించినా... ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వారు పరిహారం ఇవ్వలేకపోతున్నారు.
కుటుంబాల ఎదురుచూపు
వడదెబ్బకు గురై మృతి చెందిన వారు చాలా కుటుం బాల్లో ఉన్నా అధికారులు పరిహారం కోసం ప్రతిపాదిం చింది మాత్రం పేద కుటుంబాలనే. ఇందులో ఉపాధిహా మీ పథకం కూలీలు ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ప్రభుత్వం పరిహారం ఇస్తామనడంతో వస్తే ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుందని ఆయా కుటుంబాలు వారు ఎదురు చూస్తున్నారు. కానీ తొలిఏడాది గొప్పలు చెప్పి, ఒకసారి ఇచ్చి విరివిగా ప్రచారం చేసుకుని, తర్వాత ఏడాది నుంచి మరిచిపోవడంతో ఆయా కుటుంబాలు పరిహారానికి నోచుకోలేదు. ఇప్పుడు ఆయా కుటుంబాలు ప్రభుత్వ వైఖరిని ప్రశిస్తున్నాయి. మరో వేసవి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా గుర్తుకు తెచ్చుకుని పరిహారం విడుదల చేయాలని కోరుతున్నాయి.
నిధులు రావాల్సి ఉంది
వడదెబ్బ మృతులకు సంబంధించి రెండేళ్లుగా పరిహారం ఇవ్వని మాట నిజమే. అయితే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. వచ్చిన వెంటనే పరిహారం వారి ఖాతాలకు జమ చేస్తాం. మేమైతే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం.
– ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డీఆర్వో, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment