గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన వడ్దే రామచంద్ర గొర్రెల కాపరి. గొర్రెలు మేపేందుకు వెళ్లిన అతను వడదెబ్బకు గురై 2016 ఏప్రిల్ 27 అడవిలోనే మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు అప్పటికే వేరుగా వెళ్లి పోయాడు. దీంతో రామచంద్ర ఇద్దరు కూతుళ్లు, భార్య జీవనం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కుటుంబ యాజమాని మృతి చెందడంతో ఉన్న 30 గొర్రెలు అమ్ముకున్నారు. దీనికి తోడు రామచంద్ర భార్య శివమ్మకు అనారోగ్యం గురికావడంతో వైద్యఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేస్తామన్న లక్షరూపాయలు కూడా అందలేదు.
గార్లదిన్నె: మండే ఎండలతో వడదెబ్బ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఉపాధి కూలీలు, గొర్రెల కాపరులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకుంటామని తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న బాధిత కుటుంబాలకు నిరాశే ఎదురైంది. ఈ వేసవిలో కూడా వడదెబ్బ మరణాలు నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు మృత్యువాత పడ్డారు.
అధిక ఉష్ణోగ్రతలు నమోదు
గత రెండేళ్లుగా మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో జనం పిట్టల్లా రాలిపోయారు. జిల్లాలోనే శింగనమల మండలం తరిమెల గ్రామంలో అత్యధిక ఉష్ణోగ్రతలు దాదాపు 47 డిగ్రీల వరకు నమోదయ్యాయి. వడ దెబ్బ మృతుల విషయానికి వస్తే నియోజకవర్గంలో 25 మంది దాకా మృత్యువాత పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 226 మంది వేసవిలో ఎండ తీవ్రతకు ప్రాణాలొదిలారు.
ప్రతి పాదనలకే పరిమితం
వడ దెబ్బతో చనిపోయిన కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషి యా ఇస్తామని చెప్పింది. జిల్లాలో వడ దెబ్బతో మృతి చెందిన వారి వివరాలు అధికారులు సేకరించారు తప్ప ఇప్పటికీ మృతుల కుటుంబాలకు ఒక్క పైసా పరిహారం అందలేదు. మరి కొంతమంది ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాల వద్దకు తిరుగుతున్నా ఎవ్వరికీ పట్టడం లేదు.
ఒక్క రూపాయి పరిహారం రాలేదు
పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన చింతమాను పెద్ద నారాయణ 2016 ఏప్రిల్ 13న కట్టెల కోసం కొండకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో ఎండవేడిమికి వడదెబ్బ బారినపడ్డాడు. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెదుక్కుంటూ రాగా మార్గమద్యలో పెద్ద నారాయణ మృతదేహం కనిపించింది. తీవ్రమైన ఎండ వేడిమికి అతని శరీరమంతా బొబ్బలు వచ్చి మరణించాడు. వడదెబ్బకు గురై మరణించిన కుటుంబాలకు రూ.లక్ష పరిహారం అందించి ఆదుకుంటామని చెప్పిన చంద్రబాబు మాటలు నేటికీ కార్యరూపం దా ల్చలేదని మృతుడి భార్య అంకాళమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఎవరూ పట్టించుకోవడం లేదు
2017 సంవత్సరంలో నా భర్త సాకే రామన్న ఇంటి వద్ద గుడిసెకు మరమ్మతులు చేస్తుండగా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో వడ దెబ్బ తగిలి చనిపోయాడు. అప్పట్లో వీఆర్వో మిగతా అధికారులు వచ్చి వివరాలు అన్నీ తీసుకెళ్లారు. ఇంత వరకు ప్రభుత్వం పరిహారం అందించలేదు.– ఉత్తమ్మ, బుక్కరాయసముద్రం
Comments
Please login to add a commentAdd a comment