అక్రమా‘లే అవుట్’!
అక్రమ లే అవుట్ల తొలగింపునకు {పత్యేకాధికారి నియామకం
నేటినుంచి 29 గ్రామాల పరిధిలో అక్రమ లే అవుట్ల తొలగింపు
రెవెన్యూ అధికారుల నుంచి జాబితా స్వీకరించిన అధికారులు
లే అవుట్లు వేసి అమ్మకాలు జరిపిన రియల్‌ఎస్టేట్ వ్యాపారులు
గుంటూరు రాష్ట్ర నూతన రాజధాని ప్రాంతంలో అనధికార లే అవుట్లపై చర్యలకు రంగం సిద్ధమైంది. సీఆర్‌డీఏ పరిధిలో అక్రమ లే అవుట్ల నిర్మూలనకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారి చంద్రుడుని నియమించారు. అలాగే తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయంలో అక్రమ లే అవుట్ల జాబితాను ఉంచబోతున్నారు. ఇప్పటివరకు రాజధాని ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండా చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను ప్లాట్లుగా వేసి విక్రయాలు జరిపారు. రాజధాని ప్రాంతమైతే తమ ప్లాట్ల రేట్లు పెరుగుతాయన్న ఆశతో చాలామంది మధ్య తరగతి ప్రజలు అక్కడ ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ అక్రమ లే అవుట్లు వేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి అక్రమ లే అవుట్లను తొలగించేందుకు అవసరమైన చర్యలను అధికారులు చేపట్టారు.
సర్వేయర్లు, ఇతర సిబ్బందిని అందుబాటులో ఉండాలని సీఆర్‌డీఏ అధికారులు ఆదేశించారు. అలాగే 29 గ్రామాల పరిధిలోని భూముల వివరాలను ఇప్పటికే రెవెన్యూ అధికారుల నుంచి స్వీకరించిన సీఆర్‌డీఏ అధికారులు ఆ జాబితా ఆధారంగా లే అవుట్లను గుర్తించనున్నారు. దీంతో పాటు జియోగ్రఫీకల్ టెక్నాలజీ ద్వారా ఎప్పుడు లే అవుట్లను అభివృద్ధి చేశారన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే సీఆర్‌డీఏ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఆక్రమ లే అవుట్లపై త్వరలోనే చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉడా ఉన్న సమయంలో చాలా మంది అక్రమ లే అవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లుగా ప్రజలకు అమ్మారు. వీటిపై కూడా చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏ అధికారులు ఆదేశాలు జారీచేశారు.