దారి దోపిడీ
- ధరలు పెంచేసిన ప్రయివేట్ ట్రావెల్స్
- సంక్రాంతికి పెరిగిన రద్దీ
- రైళ్లన్నీ కిటకిట..
- దిక్కుతోచని పండగ ప్రయాణికులు
డాక్‌యార్డులో పనిచేసే శంకర్‌కు పండగకు ఎలా ఊరికి వెళ్లాలో పాలుపోవడం లేదు. విజయవాడలో అమ్మానాన్నా... రైళ్లన్నీ కిటకిట..బస్సులో ఆపసోపాలు పడలేని పరిస్థితి..పోనీ ప్రయివేట్ బస్సెక్కుదామంటే గుండెలదిరే రేట్లు చెబుతున్నారు. అవును మరి..సంక్రాంతి పండగకు అందరూ ఊళ్లు వెళ్లాల్సిందే. దీంతో ఒకటే డిమాండ్.. దీన్ని ప్రయివేట్ ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి.
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఇప్పటికే విద్యాలయాలు సెలవులు ప్రకటించడంతో కుటుంబాలతో ప్రయాణాలు పోటెత్తాయి. ట్రావెల్స్ ఆపరేటర్లు బిజీ అయ్యారు. పండగకు స్వస్థలాలు చేరుకోవాలంటే రవాణా ఛార్జీలు ధడ పుట్టిస్తున్నాయి. పండగ పేరిట ట్రావెల్స్ ఆపరేటర్లు రెట్టింపు ధరల వసూళ్లకు శ్రీకారం చుట్టారు.
విశాఖ నుంచి కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, తిరుపతి, తదితర ప్రాంతాలకు సామాన్యులు చేరుకోలేని దుస్థితి ఏర్పడింది. సాధారణ రోజుల్లో తీసుకునే చార్జీల కంటే ఒకటి, రెండు రెట్లు అదనంగా ఆపరేటర్లు వసూలు చేస్తుండటం విశేషం. రైలులో ప్రయాణాలకు అవకాశం లేకపోవడం, ఆర్టీసీ బస్సుల సౌకర్యం అంతంత మాత్రంగా ఉండటంతో ట్రావెల్స్ వ్యాపారం ఊపందుకోంది. గత రెండు నెలలుగా రోడ్డెక్కని ప్రైవేట్ బస్‌లు ఇదే అదునుగా భావించి ధరలు అమాంతంగా పెంచేశారు. ఆన్‌లైన్‌లో టికెట్ల ధరలు సాధారణంగా ఉంటున్నా ఖాళీలు లేనట్టు చూపడం,
నేరుగా ట్రావెల్స్
కార్యాలయాలకు వెళితే అధిక ధరలు వసూలు చేస్తుండటం గమనార్హం. అదే బాటలో ఆర్టీసీ..: ఆర్టీసీ ధరలు ప్రయాణికులకు చుక్క లు చూపిస్తున్నాయి. అధిక ధరలు రాబట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. డిమాండ్‌కు తగ్గట్టు సొమ్ములు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీ భరించలేక ఆర్టీసీని ఆశ్రయిస్తే అక్కడా అదే పరిస్థితి ఎదురవుతోంది. పండగ సీజన్‌లో దాదాపు వెయ్యి ప్రత్యేక సర్వీస్‌లు నడుపుతామని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, సూప ర్ లగ్జరీ, హైటెక్ బస్‌లు రాకపోకలకు వినియోగిస్తున్నారు.