‘పచ్చ’ పార్టీ నుంచి.. పరుగో.. పరుగు.. | Leaders Are Leaving From TDP In East Godavari District | Sakshi
Sakshi News home page

‘పచ్చ’ పార్టీ నుంచి.. పరుగో.. పరుగు..

Published Wed, Mar 18 2020 11:58 AM | Last Updated on Wed, Mar 18 2020 4:08 PM

Leaders Are Leaving From TDP In East Godavari District - Sakshi

వరుస పంక్చర్లతో కుదేలైపోతున్న ‘సైకిల్‌’ సచిత్రమాలిక కళ్లెదుటే కనిపిస్తోంది. వికృత చేష్టలతో, అహంకార పూరిత నిర్ణయాలతో, రాష్ట్ర ప్రగతికి అడుగడుగునా అవరోధం కల్పించేలా వ్యవహరిస్తున్న అధినాయకత్వం ప్రజలకు మరింత దూరమవుతోంది. ఐసుగడ్డను ఢీకొని, ముక్కచెక్కలవుతూ, నడిసంద్రంలో మునిగిపోతున్నట్టుగా మారిన ‘తెలుగుదేశం’ నావను భవిష్యత్తీరాలకు చేర్చడానికి.. చుక్కాని పట్టి నడిపించే భావి నేత కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఆ పార్టీలోనే ఉంటే తమ పుట్టి కూడా మునుగుతుందన్న భయంతో ‘తమ్ముళ్లు’ ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. టీడీపీకి గుడ్‌బై చెప్పి, అత్యంత ప్రజాదరణతో వెలుగొందుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు. దీంతో జిల్లాలోని టీడీపీ ముఖ్యనేతలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు.

సాక్షి, రాజమహేంద్రవరం: పార్టీ నాయకులు ఒక్కొక్కరూ జారిపోతూండడంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ బేజారెత్తిపోతోంది. అధినేత చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో విసుగు చెందుతున్న పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో వరుసగా చేరుతున్నారు. ఈ పరిణామాలు చూస్తూ కూడా ఇంకా టీడీపీలో కొనసాగడమంటే తమ రాజకీయ భవిష్యత్తుకు తామే సమాధి కట్టుకున్నట్టు అవుతుందనే భయం తెలుగు తమ్ముళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది.

గత ఫిబ్రవరి నుంచి జారిపోతున్న నేతలను నిలబెట్టుకోలేక టీడీపీ ముఖ్యనేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న జిల్లాలో వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీ బలహీనపడుతూ వచ్చింది. వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం ఖాయమనే స్పష్టమైన సంకేతాలు సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కనిపించాయి. కానీ అప్పటికంటే స్థానిక సంస్థల ఎన్నికలకు తెర లేచిన తరువాతే జిల్లాలో టీడీపీ నుంచి వలసలు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉండి నరనరానా టీడీపీ రక్తమే ప్రవహిస్తోందని బహిరంగంగా చెప్పుకునే నేతలు కూడా బయటకు పోతున్న పరిస్థితులు ఆ పార్టీ అధిష్టానానికి ఒక పట్టాన మింగుడు పడటం లేదు. వలసలను నిరోధించలేక ఆ పార్టీ ముఖ్యనేతలు దిక్కులు చూస్తున్నారు. చదవండి: ఆ జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ..!

► చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన త్రిమూర్తులుగా మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ పేరొందారు. పార్టీ పుట్టి మునిగిపోతున్నా ఈ ముగ్గురూ ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులై చూస్తున్నారు. టీడీపీలో చంద్రబాబు తరువాత నంబర్‌–2గా పేరొంది, తెర వెనుక పార్టీని నడిపించిన ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప కనీసం పార్టీ నేతలను నిలువరించలేకపోతున్నారు. 

►పార్టీని నమ్ముకున్నా నట్టేట ముంచేశారంటూ వైఎస్సార్‌ సీపీలో చేరి, తిరిగి ప్రలోభాలతో టీడీపీ పంచన చేరిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూదీ అదే పరిస్థితి. వారానికో, 15 రోజులకో ఒకసారి కాకినాడలో మీడియాతో మాట్లాడటానికే ఆయన పరిమితమవుతున్నారే తప్ప టీడీపీకి కాయకల్ప చికిత్స చేయలేకపోతున్నారు. 

►సుదీర్ఘ కాలం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన రికార్డుతో పాటు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా పని చేశారు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆయన కూడా దాదాపు కన్నెత్తి చూడడం లేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం, సొంత నియోజకవర్గం అమలాపురంలో కూడా పార్టీ ముఖ్య నేతలు వైఎస్సార్‌ సీపీలో చేరుతూ రాజప్పకు గట్టి షాక్‌ ఇస్తున్నారు. నాడు హోం మంత్రిగా పార్టీలో తన ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే తోట వర్గీయులను అమలాపురం పట్టణంలో వెతికి వెతికి మరీ కేసులలో ఇరికించి ఇబ్బందులు పాల్జేసిన నేపథ్యంలో.. వారందరూ ఇప్పుడు టీడీపీని వీడి రాజప్పకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. చదవండి: ఏబీవీ సస్పెన్షన్‌కు ఆధారాలున్నాయ్‌

►తోట త్రిమూర్తులు వైఎస్సార్‌ సీపీలో చేరడంతో రామచంద్రపురంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.

►ఇటు అమలాపురం పట్టణంలో కూడా తోట ప్రభావం, చినరాజప్పపై ఆగ్రహంతో గంగుమళ్ల కాసుబాబు, అరిగెల బుజ్జి తదితరులు మంత్రి పినిపే విశ్వరూప్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. టీఎన్‌టీయూసీ నాయకుడు, నరనరానా టీడీపీని జీర్ణించుకున్న గల్లా రాము వంటి నాయకులు కూడా ఆ పార్టీని వీడి వైఎస్సార్‌ సీపీలోకి వచ్చేశారు. అమలాపురం 25వ వార్డు మాజీ కౌన్సిలర్‌ బండారు సత్యనారాయణ, అంబాజీపేట మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బండారు లోవరాజు(చిన్ని) వైఎస్సార్‌ సీపీలో చేరారు. 

►కాకినాడ రూరల్‌ కరప మండల టీడీపీ నేత పుల్లా ప్రభాకరరావు, పండూరుకు చెందిన ట్యాంకర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు బావిశెట్టి వెంకటేశ్వరరావు మంత్రి కురసాల కన్నబాబు సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. 

►తునిలో యనమల సోదర ద్వయం ఒంటెద్దు పోకడలతో విసుగెత్తిపోయిన టీడీపీ శ్రేణులు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై నమ్మకంతో వైఎస్సార్‌ సీపీలో చేరారు. 

► రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మాజీ జెడ్పీటీసీ యాళ్ళ సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీపీ వినకోటి శ్రీనివాస్‌ టీడీపీని వీడి ఎమ్మెల్యే వేణు సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. 

►రాజమహేంద్రవరంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు, నగరపాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బర్రే కొండబాబు, బీసీ సంఘ నాయకుడు కడలి వెంకటేశ్వరరావులు సీఎం జగన్‌ సమక్షంలో; పెద్దాపురంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ముత్యాల రాజబ్బాయి పార్టీ కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. 

►కొత్తపేటలో మందపల్లి శనైశ్చర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్‌ సలాది బాబ్జీ, రావులపాలెం మాజీ ఉప సర్పంచ్‌ కర్రి సుబ్బారెడ్డి, వేమగిరిలో వెలుగుబంటి వెంకటాచలం, దొంతంశెట్టి చినవీరభద్రయ్య, దళిత సంఘం నాయకుడు జంగా బాబురావు.. ఇలా టీడీపీ నేతలు అనేకమంది ఆ పార్టీ మనుగడ కష్టమనే భావనతో వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు. 

ఈ నేపథ్యంలోనే జిల్లాలోని మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టలేక టీడీపీ చేతులెత్తేసింది. ఆ మేరకు వైఎస్సార్‌ సీపీకి 80 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ పరిణామాలన్నీ టీడీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement