- అయిదు నెలల క్రితమే ఇంటర్వ్యూలు పూర్తి
- ఇప్పటికీ నియామకాలు చేపట్టని అధికారులు
- అధికారపార్టీ నాయకుల ఒత్తిడే కారణం!
పాతగుంటూరు: అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా పోస్టులపైనా తెలుగు తమ్ముళ్ల కన్ను పడింది. దీంతో జిల్లాలోని అంగన్‌వాడీ పోస్టుల కు ఎంపికైన అభ్యర్థులు నెలల తరబడి నియామకాలకు నోచుకోక ఎదురుచూపులు చూస్తున్నారు. అయిదు నెలల క్రితమే ఇంటర్వ్యూలు పూర్తి చేసిన అధికారులు... ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వకపోవడం వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో అప్పటి కలెక్టర్ సురేశ్‌కుమార్ సమక్షంలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు-75, హెల్పర్లు - 113 పోస్టులకు అభ్యర్థులను అధికారులు ఎంపిక చేశారు.
అందులో తాడికొండ, పొన్నూరు, బాపట్ల నియోజకవర్గాల్లో 17 మందిని అంగన్‌వాడీ కార్యకర్తలుగా, 27 మందిని ఆయాలుగా నియమించారు. మిగిలిన నియామకాలు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిపోయాయి. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం కాగా, వాటిని నిలిపివేయాలంటూ అధికార పార్టీ నాయకులు అనధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయలేదు. అధికారపార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తేస్తూ పోస్టింగ్‌లు నిలిపివేయాలని సూచించినట్లు తెలిసింది. అసలు పోస్టింగ్‌లు ఇస్తారా, ఇవ్వరా అర్థంకాక ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
వీటిపై ఎన్నో సార్లు సంబంధిత అధికారులను కలిసినా ప్రయోజనం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు అందేవరకు పోస్టింగ్‌లు కేటాయిస్తారోలేదో తెలియడం లేదు. అయితే పోస్టింగ్‌లు ఎందుకు కేటాయించలేదో ప్రశ్నించినా సమాధానం చెప్పేందుకు అధికారులు జంకుతున్నారు. దీంతో అభ్యర్థులు ఎం చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. ఇంటర్వ్యూలు జరిపి ఎంపిక చేసిన వారిలో కొందరిని మార్పు చేయాలంటూ అధికారపార్టీ నాయకులు సూచిస్తున్నట్టు తెలిసింది. టీడీపీ కార్యకర్తలకు ఇవ్వాలనే ఆలోచనతోనే పోస్టింగ్‌లు నిలిపివేసినట్లు సమాచారం.
మరోవైపు ఎంపికైనవారికి పోస్టింగ్ ఇవ్వకపోతే ఆందోళన చేపడతామని అభ్యర్థులు బహిరంగంగానే అధికారులకు హెచ్చరికలు చేస్తున్నారు. న్యాయ పోరాటం చేపడతామని చెప్పినట్లు తెలిసింది. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు లేకపోవడంతో ఆయా అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు పర్యవేక్షణ కరువై ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ఖాళీగా ఉన్న పోస్టింగ్‌లు కేటాయింపులు జరపాలని కోరుతున్నారు. దీనిపై ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా మూడు నియోజకవర్గాల్లో పోస్టింగ్‌లు కేటాయించామని, మిగిలిన వాటికి కూడా ప్రభుత్వ ఉత్తర్వులు అందగానే కేటాయిస్తామని తెలిపారు.
అంగన్‌వాడీ పోస్టులపై నేతల కన్ను
Published Mon, Aug 11 2014 12:57 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement
Advertisement