రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనే మేలు: జేపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించడమే మేలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ్ అభిప్రాయపడ్డారు. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేయడం ఆయన కుటుంబ వ్యవహారమని అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ, కోస్తాంధ్రకు వచ్చే ఆదాయలోటును పూర్తిస్థాయిలో భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు బీజేపీ కూడా బాధ్యత తీసుకోవాలన్నారు.
సీఎం గాడిదలా వ్యవహరించారు: నారాయణ
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణకు నీళ్లు రావని, నిరుద్యోగ యువతకు ఉపాధి ఉండదని, పరిశ్రమలు రావని సీఎం కిరణ్ ప్రజలను మోసం చేస్తూ గాడిదలా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఆఖరి బంతులు, చివరి బంతులు అంటూ విర్రవీగిన సీఎం చివరికి రాజకీయాల నుండి పారిపోయాడని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ కలెక్టరేట్‌ను ముట్టడించారు. అనంతరం క్లాక్‌టవర్ సెంటర్‌లో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు.
ఇక కిరణ్‌కు ‘సీతారామారావు’ గతే: డొక్కా
సాక్షి, హైదరాబాద్: సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డిని గోపీచంద్ నవల ‘అసమర్థుని జీవయాత్ర’లో సీతారామారావు పాత్రతో పోల్చారు మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్. ఆ పాత్రకు ఎలాంటి ముగింపు ఉంటుందో కిరణ్‌కు అదే తరహా ముగింపు ఉంటుందన్నారు. సీఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి కిరణో, ఇంకొకరో పోయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చిరంజీవి వంటి ప్రజాదరణ ఉన్న నాయకులు పార్టీలో ఉన్నారని, ఆయనతో కలసి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పారు. మరో మంత్రి దానం నాగేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రికి ముందస్తుగానే సంకేతాలందాయన్నారు. కిరణ్‌కు నైతిక విలువలుంటే సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన మరుసటి రోజే సీఎం పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని, ఇప్పుడు రాజీనామా చేస్తూ పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు.
అవకాశవాదంతోనే రాజీనామాలు: డీఎస్
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కిరణ్, సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు స్వార్థం, అవకాశవాదంతో రాజీనామాలు చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ దుయ్యబట్టారు. ఇలాంటి వారిని నమ్ముకుని పార్టీ తప్పుచేసిందని, ఇంత నీచంగా వ్యవహరించినవారు పార్టీ వీడితేనే మేలని వ్యాఖ్యానించారు. ఆయన బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. సోనియా దయతో పదవులు అనుభవించినవారే ఆమెను వ్యతిరేకించడం దుర్మార్గమన్నారు. సోనియా బొమ్మలు తగులబెట్టి ఆమెను కించపరిచారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. సీమాంధ్రలో పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవా అని అడగ్గా.. ‘పార్టీ వల్ల ప్రతినిధులున్నారు తప్పితే ప్రతినిధుల వల్ల పార్టీ లేదు’ అని ఆయన జవాబిచ్చారు.
కాంగ్రెస్‌ను వీడను : రఘువీరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తనకు తీవ్ర ఆవేదన కలిగించినా ఇప్పట్లో కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తి లేదని మంత్రి రఘువీరారెడ్డి స్పష్టంచేశారు. కిరణ్ రాజీనామా నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నామన్నారు.
కిరణ్ అక్రమార్జనపై దర్యాప్తు జరపాలి: కోమటిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: సీఎంగా అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమార్జనకు పాల్పడిన కిరణ్ కుమార్‌రెడ్డిపై దర్యాప్తు జరిపించి, ఆయన్ను జైల్లో పెట్టాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కిరణ్ పదవిలో ఉండగా రూ. 3వేల కోట్లు అక్రమంగా సంపాదించారని, దానిని బయటపెడతామన్నారు. తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఇప్పుడు సమైక్యనాటకమాడుతున్నారని ధ్వజమెత్తారు. కాగా, సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేయడంతో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు విముక్తి లభించిందని ఎంపీలు వివేక్, మందా జగన్నాథం అన్నారు. రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీని కిరణ్ నాశనం చేశారని ధ్వజమెత్తారు.
సీఎం రాజీనామాపై నేతల భిన్నాభిప్రాయాలు
Published Thu, Feb 20 2014 2:23 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement