పిడుగురాళ్ల, న్యూస్‌లైన్ : పదేళ్ల బాలుడి హత్య కేసు మిస్టరీ వీడింది. మూడేళ్లపాటు సాగిన పోలీసుల దర్యాప్తులో ఎట్టకేలకు కేసును చేధించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో బాలుడు హత్యకు గురికావడం గమనార్హం!
వీడిన బాలుడి హత్య కేసు మిస్టరీ
Published Fri, Oct 4 2013 2:30 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
పిడుగురాళ్ల, న్యూస్‌లైన్ : పదేళ్ల బాలుడి హత్య కేసు మిస్టరీ వీడింది. మూడేళ్లపాటు సాగిన పోలీసుల దర్యాప్తులో ఎట్టకేలకు కేసును చేధించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో బాలుడు హత్యకు గురికావడం గమనార్హం! మండలంలోని పెదఅగ్రహారం గ్రామానికి చెందిన జంగిటి గోపి (10) హత్య కేసులో ఇద్దరు మహిళలు సహా ఐదుగుర్ని అరెస్టుచేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ వై.శ్రీధర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.
పెదఅగ్రహారానికి చెందిన యర్రం శ్రీనివాసరావు వ్యవసాయం చేస్తుంటాడు. అతని వద్ద 2006-10 మధ్య కాలంలో ట్రాక్టర్లకు డ్రైవర్లుగా జంగిటి శ్రీనివాసరావు, సందె బోయిన అంజయ్య పనిచేసేవారు. ఆ రైతు భార్య సరస్వతి ఇద్దరు డ్రైవర్లతో ఒకరి తర్వాత మరొకరితో వివాహేతరసంబంధం పెట్టుకుంది. మొదటివ్యక్తి శ్రీనివాసరావు తనతో సంబంధం కొనసాగించాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె అతడ్ని పనిలోంచి తొలిగించేలాచేసింది. అయినా, వివాహేతర సంబంధం కొనసాగించాలని, లేకుంటే ఈ విషయాన్ని బయటకు చెబుతానని శ్రీనివాసరావు ఆమెపై పలు మార్లు బెదిరింపులకు దిగాడు. దీంతో విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పింది. శ్రీనివాసరావును కట్టడి చేయాలని అనుకున్నా, ఏమీ చేయలేమని భావించిన భార్యాభర్తలు అతడి కుమారుడు గోపిని హతమార్చాలని పథకం రచించారు. అప్పుడిక తమ జోలికిరాడని భావించారు. అందుకుగాను రైతు దంపతులు, తమ సమీప బంధువులు సామపుష్ప, యర్రం కృష్ణ, డ్రైవర్ అంజయ్య లతో కలిసి హత్యకు పథకం రూపొందిం చారు. 2010ఆగస్టు 28న పథకం అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.
హత్యకు పథకం అమలు చేసిందిలా..
ఐదో తరగతి చదువుతున్న గోపి స్థానిక పాఠశాలకు వెళుతుండగా పథకం ప్రకారం సరస్వతి, పుష్పలు బాలుడ్ని ఇంట్లోకి పిలిచారు. యర్రం శ్రీనివాసరావు, కృష్ణ బయట కాపలా ఉన్నారు. ఇంట్లోకి వెళ్లిన గోపిని సరస్వతి, పుష్ప పట్టుకోగా, అంజయ్య రాడ్డుతో తలపై బలంగా కొట్టాడు. దీంతో గోపి అక్కడికక్కడే మృతిచెందాడు. మధ్యాహ్నం బాలుడి మృతదేహాన్ని గోనెసంచిలో కట్టుకొని ద్విచక్రవాహనంపై వెళ్లిన అంజయ్య దాచేపల్లి మండలం ముత్యాలంపాడు దాటిన తర్వాత మాటేరుకుంటలో పడవేశాడు. కుమారుడి అదృశ్యం పై అదేరోజు తండ్రి పిడుగురాళ్ల పోలీసులకు ఫిర్యాదుచేశాడు. రెండురోజుల తర్వాత సరస్వతి తదితరులు జంగిటి ఇంటికి వెళ్లి.. మీ కుమారుడ్ని మేమే చంపేశాం, ఎవరికైనా చెబితే నీకూ ఇదేగతి పడుతుందని హెచ్చరించారు.
పది రోజుల తర్వాత మాటేరుకుంటలో బాలుడి శవాన్ని గమనించిన స్థానికులు దాచేపల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెదఅగ్రహారంలో బాలుడి అదృశ్యం విషయం తెలుసుకొని అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే బెదిరింపుల వల్ల భయంతో ఉన్న శ్రీనివాసరావు దంపతులు.. ఆ మృతదేహాన్ని చూసి తమ కుమారుడు కాదని అబద్ధం చెప్పారు. కుళ్లిపోయి ఉన్న బాలుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని అవయవాలను, ఫొటోను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. దీంతో మృతుడు గోపియేనని నివేదిక వెల్లడించింది. ఈ మేరకు దాచేపల్లి పోలీస్‌స్టేషన్ నుంచి కేసును పిడుగురాళ్లకు బదలాయించగా.. దర్యాప్తు చేపట్టిన సీఐ శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది గ్రామంలో విచారణ చేపట్టి హత్యకేసులో నిందితులను గుర్తిం చారు.
గురువారం ఉదయం విశ్వసనీయ సమాచారంతో పెదఅగ్రహారం గ్రామానికి వెళ్లిన పోలీసులు నిందితులు యర్రం శ్రీనివాసరావు, సరస్వతి, ఆమె ఒదిన సామ పుష్ప, మరిది యర్రం కృష్ణ, డ్రైవర్ అంజయ్యలను అరెస్టు చేశారు. వారిపై 302, 201 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. బాలుడి హత్య కేసులో నిజానిజాలు బయటపడేందుకు కృషిచేసిన ఎస్‌ఐలు సాంబశివరావు, షేక్ జిలాని బాషా, క్రైం సిబ్బంది దరియా, కరీముల్లా, సుధీర్, నాగరాజు, సుబ్బారావు, గోపాల్, హోంగార్డులు రామకృష్ణ, నాయక్‌లకు రివారు ్డకోసం ఎస్పీకి సిఫార్సు చేసినట్లు సీఐ తెలిపారు.
Advertisement
Advertisement