రైతుల పక్షాన న్యాయపోరాటం:వైఎస్ జగన్
కడప: పసుపు రైతులకు అండగా ఉంటామని, వారి పక్షాన న్యాయపోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు వెళ్లిన జగన్ను అక్కడి పసుపు రైతులు కలిశారు. తమ బాధలు ఆయనకు చెప్పుకున్నారు. ఎకరాకు లక్ష రూపాయల చొప్పున పంట నష్టపోయినట్లు వారు తెలిపారు. కలుపుకు ముందు మందు పిచికారీ చేయడం వల్ల పసుపు పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకోవాలని వారు జగన్ను కోరారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. రైతుల రుణాలు మాఫీ కాలేదు సరికదా, రెన్యువల్ కూడా కాలేదన్నారు. అన్నదాతలకు కొత్త రుణాలు ఇవ్వలేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్ల రైతులు పంట బీమా కోల్పోయినట్లు జగన్ తెలిపారు.
ఇదిలా ఉండగా, మైదుకూరులో వైఎస్ఆర్ సీపీ నేత దస్తగిరి కూతుర్నీ, అల్లుడినీ వైఎస్ జగన్ ఆశీర్వదించారు.
**