చదువులు సాగేనా..!
ప్రాథమిక విద్యకు ప్రభుత్వం తూట్లు
ఏకోపాధ్యాయ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య
ఆందోళనలో ఉపాధ్యాయులు
జిల్లాలో సింగిల్ టీచర్ల పాఠశాలలు 716
వీటిలో విద్యార్థులు సుమారు 8 వేలు
అసలు ఉపాధ్యాయులే లేని పాఠశాలలు 122
వీరఘట్టం : సరిపడినంత ఉపాధ్యాయుల ఉన్నా ప్రభుత్వ పాఠశాలలో చదువులు అరకొరగా ఉంటాయనేది నానుడి. దీనిని బట్టి ఏకోపాధ్యాయ పాఠశాలలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెట్టాడంటే ఆ రోజు పాఠశాలకు సెలవే. టీచర్లకు కూడా వివిధ పనుల నిమిత్తం మండల కార్యాలయాలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో బడి బందే. జిల్లాలో 2,593 ప్రాథమిక పాఠశాలలు ఉండగా వీటిలో 716 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠ శాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెట్టాలంటే ముందుగా మండల విద్యాశాఖాధికారికి సమాచారం ఇవ్వాలి. ఆయన ఎవరినైనా డిప్యూటేషన్ మీద పంపాలి. పొరపాటున డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయుడు వెళ్ళకపోతే పాఠశాల మూత పడాల్సిందే. అయితే ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయులే ప్రత్యామ్నా య టీచర్‌ను నియమించి సెలవు తీసుకోవాలి. ఇలాంటి పరి స్థితుల్లో పాఠశాలలో విద్యార్థులకు చదువులు అంతంతమాత్రంగానే అందుతాయి.
ఏకోపాధ్యాయ పాఠశాలలు....
జిల్లాలో 716 సింగల్ టీచర్ పాఠశాలలుండగా సుమారు ఎనిమిది వేల మంది విద్యార్థులు ఈ ఏడాది విద్యనభ్యసిస్తున్నారు. అసలు ఉపాధ్యాయులే లేని పాఠశాలలు 122 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సుమారు 1000కి పైబడి విద్యార్థులు ఉన్నారు. వీరఘట్టం మండలంలో పాపంపేట, కుంబిడి, కొంచ, జె.గోపాలపురం గ్రామాల్లో సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నాయి. గదబవలస, శృంగరాయిపురం, గాదెలంక, సింధునగరం తదితర గ్రామాల్లో పలు కారణాలతో పాఠశాలలు మూతపడుతున్నాయి. విద్యార్థుల శాతం తగ్గడంతో గతంలో పాఠశాలలో ఏకోపాధ్యాయులు బదిలీపై వెళ్ళడంతో అక్కడికి ఎవరూ రాకపోవడంతో పాఠశాలలు మూతపడ్డాయి. ఈ గ్రామాల్లో విద్యార్థులకు విద్య అందని ద్రాక్షలా మారింది.
ప్రభుత్వ విద్యను ఎలా బలహీనపరచాలో ప్రస్తుత ప్రభుత్వం చేతల్లో చూపిస్తుంది. ప్రైవేటు విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయూలు పరోక్షంగా సహకరిస్తున్నారుు. ప్రాథమిక విద్య బలోపేతమే లక్ష్యమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మన పాలకులు దానిని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కసరత్తు చేసి అమలు చేస్తున్నారుు. దీంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తమ ఉనికిని కోల్పోతున్నారుు. ఇందులో ప్రభుత్వ పాలకుల్లోనే ఒకరిద్దరు తమ వంతు పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. పేదవాడి చెంతకు ప్రాథమిక విద్యను అందించాల్సిన ప్రభుత్వం తన బాధ్యత నుంచి క్రమేణ తప్పుకోవాలని చూస్తుంది. దీంతో వాటి మనుగడకే ముప్పు వాటి ల్లుతుంది.
భర్తీ చేస్తాం...
ఈ విషయంపై జిల్లా విద్యాశాఖాధికారి దేవానంద్‌రెడ్డి వద్ద సాక్షి ప్రస్తావించగా సింగిల్ టీచర్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగితే ఉపాధ్యాయ పోస్టులు మంజూరవుతాయన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తరచూ ఉపాధ్యాయులు, గ్రామసర్పంచ్, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.