లేపాక్షి వైభవాన్ని ప్రపంచస్థాయిలో చాటాలి
♦ లేపాక్షి నంది ఉత్సవాల్లో వక్తల పిలుపు
♦ వైభవంగా ముగిసిన ఉత్సవాలు
అనంతపురం: లేపాక్షి వైభవాన్ని ప్రపంచస్థాయిలో చాటాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా లేపాక్షిలో రెండు రోజులపాటు నిర్వహించిన లేపాక్షి నంది ఉత్సవాలు ఆదివారం రాత్రి వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్థానిక ఏపీ గురుకుల పాఠశాలలో నిర్వహించిన సభకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అధ్యక్షత వహించిన ఈ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడారు. బాలకృష్ణ చొరవ వల్లే లేపాక్షి గురించి దేశం నలుమూలలా తెలిసిందన్నారు.
బాలకృష్ణ మాట్లాడుతూ... చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నా ఎప్పుడూ కలగని మధురానుభూతి ఈరోజు కలిగిందని చెప్పారు. అపురూప శిల్ప సౌందర్యం లేపాక్షి సొంతమని తెలిపారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. కర్ణాటక మంత్రి, సినీనటుడు అంబరీష్ వచ్చీరాని తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. మరో సినీ నటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ... భారతదేశ చరిత్ర పటంలో లేపాక్షి నిలిచేలా ఉత్సవాలు నిర్వహించారని అభినందించారు.
లేపాక్షి శిల్పకళ అద్భుతం
లేపాక్షి ఆలయ శిల్పకళ అద్భుతమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కొనియాడారు. లేపాక్షి ఉత్సవాలకు హాజరైన ఆయన విలేకరుల తో మాట్లాడారు. శ్రీకృష్ణదేవరాయలు, గురజాడ, శ్రీశ్రీ, వీరేశలింగం లాంటి మహానుభావుల ద్వారా తెలుగు భాష నలుదిశలా వ్యాపించిందన్నారు. వేషం వేరైనా తెలుగువారంతా ఒక్కటేనని చెప్పారు. రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలతోపాటు పురాతన ఆలయాలు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న భారతదేశం వైపు యావత్ ప్రపంచం చూస్తోందని తెలిపారు. హిందూ దేవతలను అవమానపరిచేలా కొన్ని దుష్టశక్తులు యువతను పురిగొల్పడం మంచి పద్ధతి కాదన్నారు.కాగా ఈ సందర్భంగా నిర్వహించిన సాంసృ్కతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ నృత్యరూపకంలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర పోషించి సభికులను అలరించారు.