వాజ్‌పేయి, బాలకృష్ణ, మోహన్ బాబు
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేశారు. కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. వాజ్‌పేయి మరణం దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో విషాదం నింపింది.
దేశ రాజకీయ రంగంలో మహోన్నతుడు వాజ్ పేయి : మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి
ఒక ఓటుతో ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా ప్రజాస్వామ్య విలువలను కాపాడిన మహోన్నతుడు వాజ్‌పేయి అని కొనియాడారు. ఇప్పటి నేతలు ఆయన విలువలు, ఆదర్శాలను పాటించాలని సూచించారు. స్వర్ణ చతుర్భుజి, అణు పరీక్షలు, నదుల అనుసంధానం చేసిన గొప్ప నేతని ప్రశంసలు కురింపించారు. ఆయన ఆత్మకు చేకూరాలని ప్రార్ధించినట్లు తెలిపారు.
వాజపేయి మృతి దేశానికి తీరని లోటు: ఉత్తమ్ కుమార్ రెడ్డి(టీపీసీసీ అధ్యక్షులు)
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకులు, మేధావి, మాజీ ప్రధాని, భారత్ రత్న అటల్ బిహారీ వాజపేయి మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. వాజపేయి మరణం ఈ దేశానికి లోటు అని, గొప్ప రాజకీయ మేధావిగా సౌమ్యునిగా విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వాజపేయి రాజకీయ నాయకులకు స్ఫూర్తి, మార్గదర్శి అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు వెల్లడించారు.
మహోన్నతమైన రాజకీయ నేతను కోల్పోయాం : నందమూరి బాలకృష్ణ
మా 'బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్'ను జూన్ 22, 2000 సంవత్సరంలో ఇనాగ్యురేట్ చేసిన మహానుభావుడు వాజపేయి. నాన్నగారితో ఆయనకి మంచి అనుబంధం ఉండేది. ఎన్డీయే ప్రభుత్వంతో కలిసి తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా పనిచేసింది. ఆయన మంచి వ్యక్తి, భావుకత పుష్కలంగా ఉన్న కవి కూడా. ప్రధానిగా సేవలందిస్తూ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న సమర్ధుడు ఆయన. ఆయన విధివిధానాలు పలువురికి పారదర్శకంగా నిలిచాయి. అంతటి మహోన్నత రాజకీయ నాయకుడిని కోల్పోవడం బాధాకరమే కాదు, జాతీయ స్థాయి రాజకీయాలకు తీరని లోటు.
వాజపేయి ఓ నిస్వార్ధమైన రాజకీయ నాయకుడు: ఎం.మోహన్ బాబు
వాజపేయిగారితో మూడుసార్లు వేదిక పంచుకొనే అవకాశం దొరికింది. నా మాటలను మెచ్చుకొనేవారు ఆయన. నేను, విద్యాసాగర్ రావు, వాజపేయి కలిసి పనిచేసాం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించాను. రాజకీయాల్లో వాజపేయి లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషులు చాలా అరుదు. ఆయన నిస్వార్ధపరుడైన రాజకీయ నాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాధుని కోరుకుంటున్నాను.
దేశానికి తీరని లోటు: టీడీపీ ఎంపీ తోట నరసింహం
మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారి వాజ్ పేయి మరణం దేశానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. దేశం ఒక గొప్ప రాజ నీతిజ్ఞుడిని, గొప్ప నేతను కోల్పోయిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment