రాష్ట్ర ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతోంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెబుతున్న పాలకులు మరోవైపు నిబంధనల పేరుతో వాటిని దక్కకుండా చేస్తున్నారు. రాయితీ పెంచుతున్నట్లు ఓ వైపు ప్రకటించి, ఇంకోవైపు లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేలా నిబంధనలు తెచ్చారు. ఇటీవల జారీ అయిన 101 జీఓతో నిరుద్యోగులు స్వయం ఉపాధి అవకాశాలు కోల్పోనున్నారు.
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్: ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ, వికలాంగులైన నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో పలు పథకాలు అమలులో ఉన్నాయి. సాధారణంగా కిరాణా దుకాణాలు, చీరలు, గాజుల వ్యాపారాలు, ఫొటో స్టూడియోలు, జెరాక్స్ సెంటర్లు, గొర్రెల పెంపకం తదితర యూనిట్లకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తుంటాయి. ఎస్సీ, బీసీ, వికలాంగులు, మైనార్టీ కార్పొరేషన్లు, ఐటీడీఏ ద్వారా సబ్సిడీ ఇస్తాయి. అందులో భాగంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో 12,656 మందికి రుణాలు మంజూరు చేయాలని లక్ష్యం నిర్దేశించారు. దాదాపు 6500 మంది బ్యాంకు విల్లింగ్ లెటర్‌తో పాటు అన్ని ధ్రువీకరణ పత్రాలను ఆయా కార్పొరేషన్లకు అందజేశారు.
డిసెంబర్ నాటికే సగం మందికి రుణాలు మంజూరు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు ఒక్కరికి కూడా అందలేదు. మరోవైపు అర్హులందరూ జనవరి 19వ తేదీ లోపు ఆయా మండల, మున్సిపల్ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ మేరకు నిరుద్యోగుల నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అయితా ప్రభుత్వం తాజాగా రూపొందించిన నిబంధనలు వీరికి తీవ్ర నిరుత్సాహం మిగిలిస్తున్నాయి. నిరక్షరాస్యులతో పాటు కొన్ని నెలల క్రితమే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన వారు ఇప్పుడు అనర్హులవుతున్నారు.
నిబంధనలు సడలించాలి:
వయోపరిమితి విధిస్తూ ఇచ్చిన జీఓతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. నిరుద్యోగులు స్వయం ఉపాధికి కూడా దూరమయ్యే పరిస్థితి నెలకొంది. వెంటనే నిబంధనలను సడలించాలి.
- పందిటి సుబ్బయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు
అర్హులకే రుణాలు:
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలోనూ అర్హులకే రుణాలు మంజూరవుతాయి. 101 జీఓ ప్రకారమే రుణాల మంజూరు జరుగుతుంది.
- డాక్టర్ వి.కోటేశ్వరరావు,
ఈడీ, బీసీ కార్పొరేషన్
రుణానికి నిబంధనాలు
Published Wed, Jan 22 2014 4:11 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement