నాగర్‌కర్నూల్‌రూరల్/తెలకపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ విముక్తికోసం, ఇక్కడి ప్రజల బాగుకోసమే తెలంగాణ రాష్ట్రం కావాలని అడుగుతున్నామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సీమాంధ్రుల అధికారదాహమే తెలంగాణ ప్రాంత వెనకబాటుకు కారణమైందని ధ్వజమెత్తారు.
తెలంగాణలో ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ముసాయిదా బిల్లు పత్రాలను కాల్చివేస్తే తెలంగాణ ఆగిపోతుందనుకోవడం సీమాంధ్రుల మూర్ఖత్వమే అవుతుందన్నారు. సోమవారం తెలకపల్లిలో భోగరాజు ఆంజనేయులు మిత్రబృందం, టీజేఏసీ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం స్థానిక మార్కెట్‌యార్డు ఆవరణలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో కొన్ని లోపాలున్నాయని, హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడ తయారయ్యే విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వకుండా ఇతరరాష్ట్రాల్లో తయారైన విద్యుత్‌ను ఇస్తామనడం సరికాదన్నారు. 610జీఓ ప్రకారం ఉద్యోగాల పంపిణీ జరగాలన్నారు.
జయశంకర్ త్యాగఫలమే తెలంగాణ
జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం మంచి ఆలోచన విధానమని, ఆయన త్యాగఫలితం వల్లే ఈనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అలాంటి మహనీయుల విగ్రహాలు పెట్టుకోవడం మంచి ఆలోచన అని అభినందించారు. మహాత్ముల విగ్రహాలు తోవ చూపుతాయన్నారు. నీళ్లు, నిధులు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై జయశంకర్ నిరంతర పోరాటం చేశారని వివరించారు. చంద్రబాబుతోనూ, వైఎస్‌ఆర్‌తోనూ పోట్లాడారని గుర్తుచేశారు.
సమైక్యపాలనలో నష్టం: కేటీఆర్
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ..దోచుకునేందుకే కలిసుండాలని సీమాంధ్రులు కోరుకుంటున్నారని అన్నారు. సమైక్యపాలనలో పాలమూరుకే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ప్రత్యేకరాష్ట్రం ఏర్పడితే పాలమూరుకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలో 38లక్షలమంది ఉంటే ఏటా 14 వేలమందికి పైగా వలస పోతున్నారని, ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే పాలమూరు సస్యశ్యామలం అవుతుందన్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్ ప్రాంతాలు తప్పనిసరిగా జిల్లాలు అవుతాయని పేర్కొన్నారు.
వెనకబాటుకు నాయకులే కారణం
టీజీఓ అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఈ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న నాయకులు అభివృద్ధిని పట్టించుకోకపోవడం వల్లే జిల్లా వెనుకబడిందని విమర్శించారు. పాలమూరు నుంచే ఎక్కువ శాతం వలసలు పోతున్నారని అన్నారు. మన జీతాలు కాంట్రాక్ట్ బతుకులయ్యాయని, మన బతుకులు కాంట్రాక్ట్ బతుకులయ్యాయని, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ వచ్చాక నీళ్లు, నిధులు, ఉద్యోగాలు సాధ్యమవుతాయని, మన రాష్ట్రాన్ని మనం పాలించుకున్నప్పుడే ఆత్మగౌరవం దక్కుతుందన్నారు. ఎంపీ మందా జగన్నాథం మాట్లాడుతూ.. ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుపై రాజపత్రం బయటికి వచ్చిన తరువాతే సంబరాలు జరుపుకుందామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టి.లక్ష్మారెడ్డి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిధి కిరణ్, మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి అబ్రహాం, బైకని శ్రీనివాసులు, సంధ్యారాణి, ఇంద్రారెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.
బతుకు బాగు కోసమే పోరాటం
Published Tue, Jan 14 2014 3:02 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement