లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న రవికాంత్‌రెడ్డి. చిత్రంలో సీనియర్ పాత్రికేయులు వెంకటరెడ్డి, పోతుకూరి శ్రీనివాసరావు, పలు విభాగాల్లో అవార్డులు అందుకున్న సాక్షి ఫొటో గ్రాఫర్లు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ‘సాక్షి’ పత్రిక ఫొటో ఎడిటర్ రవికాంత్‌రెడ్డి లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అందుకున్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ జర్నలిజం దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలో 2018–ఇండియా ప్రెస్ ఫొటో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మంత్రి దేవినేని ఉమా జ్యోతి ప్రజ్వలన చేసి మూడో జాతీయ స్థాయి ఫొటో ప్రదర్శనను ప్రారంభించి తిలకించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. చెప్పలేని భావాలు, సందర్భాలను కళ్లకు కట్టినట్లుగా చెప్పేవి ఫొటోలేనన్నారు. ఫొటో జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది జాతీయ స్థాయి పోటీలు నిర్వహించి అవార్డులు అందజేయడం అభినందనీయమన్నారు. ఏపీ ఫొటోగ్రఫీ అకాడమీ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈ పోటీకి మొత్తం 1,890 ఫొటోలు వచ్చాయని చెప్పారు. ఫొటోగ్రాఫర్లల్లో సృజనాత్మకతను పెంచడానికి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ‘సాక్షి’ ఫొటో ఎడిటర్ రవికాంత్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి పత్రిక మాజీ ఎడిటర్ దండమూడి సీతారామ్‌కు లైఫ్ టైమ్ ఎఛీవ్‌మెంట్ పురస్కారం అందజేశారు. అలాగే పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఫొటోగ్రాఫర్లకు కూడా అవార్డులు అందజేశారు. వీరిలో ‘సాక్షి’కి చెందిన పలువురు ఫొటోగ్రాఫర్లున్నారు.
స్పాట్ న్యూస్ పిక్చర్ విభాగంలో జి.వీరేష్ (అనంతపురం), కె.చక్రపాణి (విజయవాడ), ఎండీ నవాజ్ (విశాఖ)కు కన్సోలేషన్ బహుమతులు.. వి.రూబెన్ బెసాలియేల్ (విజయవాడ), వీరభగవాన్ తెలగరెడ్డి (విజయవాడ), ఐ.సుబ్రమణ్యం (తిరుపతి), పి.విజయకృష్ణ (విజయవాడ), ఎం.వెంకటరమణ (గుంటూరు)కు స్పాట్ న్యూస్, జనరల్ న్యూస్ విభాగాల్లో శ్యాప్ ఎచీవ్‌మెంట్ అవార్డులు దక్కాయి. ఎన్.కిశోర్ (విజయవాడ), ఎం.మనువిశాల్ (విజయవాడ)కు ఎఫ్‌ఐసీ హానర్‌బుల్ మెన్షన్ అవార్డులు.. తెలంగాణకు సంబంధించిన శివ కొల్లోజు(యదాద్రి)కు బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.
ఎం.రవికుమార్ (హైదరాబాద్), దశరథ్ రజ్వా (కొత్తగూడెం)కు స్పాట్ న్యూస్ పిక్చర్ విభాగంలో కన్సోలేషన్ బహుమతి లభించింది. గుంటుపల్లి స్వామి (కరీంనగర్)కి జనరల్ న్యూస్ విభాగంలో ‘మారుతీరాజు మెమోరియల్’ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు, కల్చరల్ సెంటర్ చైర్మన్ వైహెచ్ ప్రసాద్, సీఈవో శివనాగిరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే నాయకుడు అంబటి ఆంజనేయులు, చందు జనార్ధన్, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, స్టేట్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సీహెచ్‌వీఎస్ విజయభాస్కర్, ప్రధాన కార్యదర్శి వై.డి.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment