Ravikanth Reddy
-
నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్ మై ఫ్రెండ్!
భరత్ భూషణ్ (బి.బి)... ఆ పేరు చెప్పగానే ముఖం మీద ఓ చిన్న నవ్వు, మెడల వరకూ పొడవాటి జుట్టు, భుజానికి కెమెరా గుర్తు కొస్తాయి. కానీ, ఆ చిరునవ్వు వెనుక ఎన్నో ఒడుదొడుకులు, కష్టాలు, కన్నీళ్ళు. వాటన్నిటినీ దిగమింగుకొని పైకి మాత్రం అదే నవ్వుతో పలకరిస్తూ ఉండే వాడు. క్యాన్సర్ ఆపరేషన్ అయ్యాక తన మెడ మీద మచ్చ ఏర్పడింది. ఆ మచ్చ, క్యాన్సర్ తాలూకు బాధ ఎవరికీ కనపడకుండా దాచాలని తను జుట్టు పొడుగ్గా పెంచాడు. భూషణ్ స్వతహాగా మిత భాషి. జర్నలిస్టు, ఫోటో గ్రాఫర్ సహచరులు ఏ అసైన్ మెంట్లో కనపడినా, ‘ఎలా ఉన్నావు మిత్రమా’ అన్న పిలుపు, పలకరింపు. ‘ఏం కొత్త కెమేరాలు కొన్నారు’ అనే స్టాండర్డ్ ప్రశ్న. అలా 1984లో ‘ఉదయం’ రోజుల నుంచి పరిచయం. భూషణ్ ఎక్కువగా వామపక్ష (సీపీఐ, సీపీఎం, ఎంఎల్) ప్రోగ్రామ్స్ కవర్ చేసేవారు. అవి జరిగే ముఖ్దూమ్ భవన్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం లాంటి చోట్ల కెమేరాతో ప్రత్యక్ష మయ్యేవాడు. అప్పట్లో పేపర్లలో ఎవరైనా మావోయిస్టుల ఫొటోలు కావాలన్నా, సీపీఐ, సీపీఎం లీడర్ల క్లోజప్ ఫొటోలు కావాలన్నా తననే అడిగేవాళ్లం. ఆ ఫొటోలకు తను ఫేమస్. ఫొటోలలో ఎవరు ఏది అడిగినా ప్రింట్ చేసి, ఇచ్చేవాడు. కాల క్రమేణా ఫొటో ప్రింట్స్, డిజిటల్‌గా మార డంతో కొంత ఇబ్బంది పడ్డాడు. ఫొటోగ్రాఫర్ వృత్తిని కొన్ని రోజులు పక్కనపెట్టి కార్టూన్స్, పెయింటింగ్స్ సాన బెట్టాడు. అప్పుడప్పుడు పిలిచి మరీ చూపించేవాడు. ఆ సమయంలోనూ ఫొటో గ్రాఫర్లకు గుర్తింపు లేదని బాధపడేవాడు. (చదవండి: నాన్న చూపిన ఉద్యమ పథం...) అనారోగ్యం, ఆర్థిక కష్టాలు, కుటుంబ బాధ్యతలు మానసికంగా కుంగదీశాయి. అయినా ఎక్కడా బాధపడేవాడు కాదు. ఎప్పుడూ తెలంగాణ గురించి, సంస్కృతి గురించి మాట్లాడేవాడు. అప్పుడే ప్రత్యేక తెలంగాణ గురించి తన ఆలోచనకు పదును పెట్టాడని చెప్పవచ్చు. ‘రంగుల కల’ లాంటి కొన్ని ఆర్ట్ సినిమాలకూ పనిచేశాడు. కొత్త రాష్ట్రం వచ్చాక బతుకమ్మ, తెలంగాణ సంస్కృతిపై ఎగ్జిబిషన్ పెట్టడం అతనికి సంతోషాన్నిచ్చింది. తనకు బ్లూ కలర్ ఇష్టం. వేసుకొనే టీ షర్ట్లు, రాసుకొనే పెన్ను, ఆఖరికి తను వాడే వస్తువులు, ఇంట్లో కూడా అంతా ‘బ్లూ’ కలరే. ఆయన తీసిన ఫొటోలలో బ్లాక్ అండ్ వైట్, బ్లూ, రెడ్, గ్రీన్, ఆరెంజ్ రంగులు కనపడేవి. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి) గజ్జెల మల్లారెడ్డి, ఏబీకే ప్రసాద్, వి. మురళి, కె. శ్రీనివాస్ లాంటి ఎడిటర్లందరికీ ఇష్టమైన ఫొటో జర్నలిస్టుల్లో బి.బి. ఒకడు. ఇటీవల క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టినప్పుడు ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ వ్యక్తిగతంగా సాయపడింది. ప్రెస్ అకాడమీతో ప్రస్తుత తెలంగాణ సర్కార్ ఆర్థికంగా సాయపడింది. అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా అసోసియేషన్ మీటింగంటే, ఓపిక చేసుకొని, తోటి ఫొటోగ్రాఫర్ల బండి మీద వచ్చి, వెళ్ళేవాడు. అందరితో కలవడం అతని కెమేరాకి కొత్త రీఛార్జ్. రోజుకో ఉద్యోగం మారే రోజుల్లో దశాబ్దాల తరబడి నమ్ము కున్న వృత్తిలోనే నిబద్ధతతో పని చేసినవాడు... పని తప్ప బతకడం తెలీనివాడు.. ఫోటోనే ప్రేమించిన వాడు భూషణ్. పాతికేళ్ళుగా క్యాన్సర్‌పై పోరాడిన అతనొక సైనికుడు. చేతిలోని కెమేరానే కన్ను, గన్ను. ఆఖరి వరకూ అలాగే నిలిచాడు. ప్రాణం పోయినా, పోరాటస్ఫూర్తిలో గెలిచాడు. సెల్యూట్ మై ఫ్రెండ్! – కె. రవికాంత్ రెడ్డి ఫొటో ఎడిటర్, సాక్షి -
‘సాక్షి’ ఫొటో ఎడిటర్‌కు లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ‘సాక్షి’ పత్రిక ఫొటో ఎడిటర్ రవికాంత్‌రెడ్డి లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అందుకున్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ జర్నలిజం దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలో 2018–ఇండియా ప్రెస్ ఫొటో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మంత్రి దేవినేని ఉమా జ్యోతి ప్రజ్వలన చేసి మూడో జాతీయ స్థాయి ఫొటో ప్రదర్శనను ప్రారంభించి తిలకించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. చెప్పలేని భావాలు, సందర్భాలను కళ్లకు కట్టినట్లుగా చెప్పేవి ఫొటోలేనన్నారు. ఫొటో జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది జాతీయ స్థాయి పోటీలు నిర్వహించి అవార్డులు అందజేయడం అభినందనీయమన్నారు. ఏపీ ఫొటోగ్రఫీ అకాడమీ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈ పోటీకి మొత్తం 1,890 ఫొటోలు వచ్చాయని చెప్పారు. ఫొటోగ్రాఫర్లల్లో సృజనాత్మకతను పెంచడానికి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ‘సాక్షి’ ఫొటో ఎడిటర్ రవికాంత్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి పత్రిక మాజీ ఎడిటర్ దండమూడి సీతారామ్‌కు లైఫ్ టైమ్ ఎఛీవ్మెంట్ పురస్కారం అందజేశారు. అలాగే పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఫొటోగ్రాఫర్లకు కూడా అవార్డులు అందజేశారు. వీరిలో ‘సాక్షి’కి చెందిన పలువురు ఫొటోగ్రాఫర్లున్నారు. స్పాట్ న్యూస్ పిక్చర్ విభాగంలో జి.వీరేష్ (అనంతపురం), కె.చక్రపాణి (విజయవాడ), ఎండీ నవాజ్ (విశాఖ)కు కన్సోలేషన్ బహుమతులు.. వి.రూబెన్ బెసాలియేల్ (విజయవాడ), వీరభగవాన్ తెలగరెడ్డి (విజయవాడ), ఐ.సుబ్రమణ్యం (తిరుపతి), పి.విజయకృష్ణ (విజయవాడ), ఎం.వెంకటరమణ (గుంటూరు)కు స్పాట్ న్యూస్, జనరల్ న్యూస్ విభాగాల్లో శ్యాప్ ఎచీవ్మెంట్ అవార్డులు దక్కాయి. ఎన్.కిశోర్ (విజయవాడ), ఎం.మనువిశాల్ (విజయవాడ)కు ఎఫ్ఐసీ హానర్‌బుల్ మెన్షన్ అవార్డులు.. తెలంగాణకు సంబంధించిన శివ కొల్లోజు(యదాద్రి)కు బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఎం.రవికుమార్ (హైదరాబాద్), దశరథ్ రజ్వా (కొత్తగూడెం)కు స్పాట్ న్యూస్ పిక్చర్ విభాగంలో కన్సోలేషన్ బహుమతి లభించింది. గుంటుపల్లి స్వామి (కరీంనగర్)కి జనరల్ న్యూస్ విభాగంలో ‘మారుతీరాజు మెమోరియల్’ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు, కల్చరల్ సెంటర్ చైర్మన్ వైహెచ్ ప్రసాద్, సీఈవో శివనాగిరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే నాయకుడు అంబటి ఆంజనేయులు, చందు జనార్ధన్, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, స్టేట్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సీహెచ్‌వీఎస్ విజయభాస్కర్, ప్రధాన కార్యదర్శి వై.డి.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ ఫొటో ఎడిటర్‌కి లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు
సాక్షి, అమరావతి: స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మూడో జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ‘సాక్షి’ఫొటో ఎడిటర్ కె.రవికాంత్‌రెడ్డికి లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు లభించింది. ఆయనతో పాటు ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ దండమూరి సీతారామ్, ఈనాడు దినపత్రిక సీనియర్ ఫొటోగ్రాఫర్ కేశవులు కూడా ఎంపికయ్యారు. 2018వ సంవత్సరానికి స్పాట్, జనరల్ న్యూస్, పర్యాటకం అంశాలపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 18 రాష్ట్రాల నుంచి 1,890 ఫొటోలు ఎంట్రీలుగా నమోదయ్యాయి. ముంబైకి చెందిన ఫోర్బ్స్ పత్రిక చీఫ్ ఫొటోగ్రాఫర్ వికాస్ కోట్, ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.నాగేశ్వరరావు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చీఫ్ ఫొటోగ్రాఫర్ ఆర్బీ కోటేశ్వరరావులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ‘సాక్షి’ఫొటో జర్నలిస్ట్‌లకు పలు విభాగాల్లో అవార్డులు లభించాయి. బహుమతుల్ని నవంబర్ 1న విజయవాడ కల్చరల్ సెంటర్లో ప్రదానం చేస్తారని స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
విలేకరి మృతికి సంతాపం
అంబర్‌పేట,న్యూస్‌లైన్: ‘సాక్షి’ నార్సింగి విలేకరి బాలరాజు మృతి పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతిచెందిన విషయం తెలిసి ‘సాక్షి’ సిటీబ్యూరో ఇంచార్జ్ విజయ్‌కుమార్‌రెడ్డి, ఫొటోవిభాగం ఎడిటర్ ఇంచార్జ్ రవికాంత్‌రెడ్డి, రంగారెడ్డిజిల్లా జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం జర్నలిస్టు సంఘం అధృక్షుడు వెంకటేష్ తదితరులు బాలరాజు భౌతికకాయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. వివిధ చానళ్లు, పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఆస్పత్రికి తరలివచ్చారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ సంతాపం: రోడ్డు ప్రమాదంలో బాలరాజు మృతిచెందడంపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బసవపున్నయ్య, ప్రధానకార్యదర్శి జి.ఆంజనేయులు, కార్యదర్శి మామిడి సోమయ్య, నేషనల్ కోఆర్డినేటర్ అమరయ్యలు ఒక ప్రకటనలో సంతాపం తెలియజేశారు. అతిచిన్న వయస్సులోనే బాలరాజును మృత్యువు కంబళించడంపై తీవ్రదిగ్భ్రాంతికి లోనయ్యారు. మాజీ హోంమంత్రి సంతాపం :రోడ్డు ప్రమాదంలో బాలరాజు దుర్మరణం పాలవడంపై మాజీ హోంమంత్రి సబితారెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. వార్తల సేకరణలో బాలరాజు చురుకుగా ఉండేవారని గుర్తుచేశారు.