తిమ్మాజిపేట, న్యూస్‌లైన్: నాటి ‘వెలుగు’.. నేటి ‘ఇందిరాక్రాంతి పథం’ సిబ్బంది కొందరు అక్రమాలకు తెరతీశారు. ఆమ్‌ఆద్మీ పథకం ద్వారా బాధితులకు అందజేయాల్సిన పరిహారంలో అవకతవకలకు పాల్పడ్డారు. పక్కదారి పట్టిన రూ.మూడు లక్షలను రికవరీ చేయించాలని ఉన్నతాధికారులు స్థానిక ఏపీఎం నిర్మలామేరీని ఆదేశించారు.
స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గురువారం జరిగిన సామాజిక తనిఖీ సభలో అక్రమాలు వెలుగుచూశాయి. ఉపాధి పనులపై ఈ నెల14 నుంచి 24వ తేదీ వరకు మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో ఈ తనిఖీ నిర్వహించారు. ఉపాధి పనులు, కూలీలకు వేతనం చెల్లింపు, ఐకేపీ ద్వారా ఉపకార వేతనాలు, ఆమ్‌ఆద్మీ పథకంలో బాధితులకు అందుతున్న పరిహారం, స్మార్ట్‌కార్డుల ద్వారా పింఛన్లు అందుతున్న తీరు తదితర అంశాలపై సామాజిక తనిఖీ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. వివరాలను డీఆర్‌పీలు వివరించారు.
ఇవిగో అక్రమాలు..
కుటుంబ యజమాని సాధారణ లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే అమ్‌ఆద్మీ బాండు కలిగి ఉన్న వారి కుటుంబంలో నామినీకి సాధారణ మరణమైతే రూ.30 వేలు, ప్రమాదవశాత్తు జరిగే రూ.70వేలు ఐకేపీ(వెలుగు) ద్వారా చెల్లిస్తారు. అయితే మండలంలోని ఆయా గ్రామాల్లో బాధిత కుటుంబాలకు రూ.3.47 లక్షల పరిహారం లెక్క తేలలేదని అధికారులు తేల్చారు. పరిహారం సక్రమంగా ఎందుకు పంపిణీచేయలేదని సంబంధిత అధికారులు బీమామిత్రపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
బుద్ధసముద్రంలో రూ.55వేలు, బాజీపూర్‌లో రూ.33.90వేలు, బావాజిపల్లిలో రూ.36.50వేలు, పుల్లగిరిలో రూ.37.20వేలు, చేగుంటలో రూ.8400, మారేపల్లిలో రూ.3వేలు, తిమ్మాజిపేటలో రూ.2,400, గొరిటలో రూ.1200, అమ్మపల్లిలో రూ.1200, పోతిరెడ్డిపల్లిలో రూ.55వేలు, నేరళ్లపల్లిలో రూ.30వేలు అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖిలో వెల్లడైంది. వీటిపై విచారణ జరిపి రికవరీ చేయాలని డీపీఎం శేషరావు ఐకేపీ సిబ్బందికి సూచించారు. అలాగే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. మండలంలోని ఇప్పలపల్లిలో రూ.22,400, రాళ్లచెరువు తండాలో రూ.11,600, పోతిరెడ్డిపల్లిలో రూ.5వేలు..ఇతర గ్రామాల్లో మొత్తం రూ.45వేల లెక్కతేలలేదు. వీటికి సంబంధించి స్మార్ట్‌కార్డు సిబ్బంది, గ్రామసంఘాల వీఓలు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. కార్యక్రమంలో పీఓ పాపయ్య, ఎండీఓ హరినందన్‌రావు, డీవీఎం సుబ్రమణ్యం, క్లస్టర్ ఏపీడీ శ్యాముల్, ఐకేపీ డీఏపీఎం శేషరావు, క్యూసీ కృష్ణయ్య, ఎస్‌ఆర్‌పీ రాజేశ్వరి, ఏపీఓ సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
‘వెలుగు’లో చీకట్లు!
Published Fri, Sep 27 2013 4:12 AM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM
Advertisement
Advertisement