విజయవాడకు లైట్ మెట్రో రైలు
సీఎంకు నివేదిక ఇచ్చిన జర్మనీ కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ
సాక్షి, అమరావతి: విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనను పక్కనపెట్టారు. దీనికి బదులుగా లైట్ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టాలని సీఎం చంద్రబాబునిర్ణయించారు. జర్మనీ ఆర్థిక సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ రవాణారంగ నిపుణుడు ఎడ్వర్డ్ డాట్సన్ బుధవారం సచివాలయంలో సీఎంను కలసి లైట్ మెట్రోపై నివేదిక అందజేశారు. దానిని పరిశీలించిన సీఎం వెంటనే ఆమోదం తెలిపారు. వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. మూడు మార్గాల్లో రానున్న ఈ లైట్ మెట్రో రైలు ప్రాజెక్టును 40 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తామని, గత ప్రాజెక్టులో లేని గన్నవరం ఎయిర్‌పోర్టు, జక్కంపూడి కాలనీలను ఇందులో అనుసంధానించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.డీఎంఆర్‌సీ ప్రతిపాదించిన మెట్రోకంటే లైట్ మెట్రో నిర్మాణ ఖర్చు 25 శాతం తగ్గుతుందని, నిర్వహణ ఖర్చూ 22 శాతానికి తగ్గుతుందన్నారు.
మెట్రో నిర్మాణానికి కిలోమీటర్‌కు రూ.250 కోట్లు ఖర్చవుతుండగా, లైట్ మెట్రోకు రూ.170 కోట్ల నుంచి రూ.180 కోట్లే ఖర్చవుతుందన్నారు. మెట్రో నిర్వహణ ఖర్చు ఏడాదికి 26 కిలోమీటర్లకు రూ.160 కోట్లు అయితే.. లైట్ మెట్రోకు రూ.106 కోట్లు ఖర్చవుతుందన్నారు. మెట్రోకు కనీసం మూడు బోగీలు తప్పనిసరని, లైట్ మెట్రోను రెండు బోగీలతో ప్రారంభించి ప్రయాణికుల సంఖ్య పెరిగేకొద్దీ అదనపు బోగీ ఏర్పాటు చేసుకునే వీలుంటుందన్నారు. మెట్రో బోగీలో 250మంది ప్రయాణించే వీలుంటే.. లైట్ మెట్రో బోగీలో 200 మంది ప్రయాణించవచ్చన్నారు.
రాజధానికి ఏటా రూ.1500 కోట్లివ్వాలి
అమరావతిలో మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులకోసం 11 ఏళ్లపాటు రాష్ట్రప్రభుత్వం ఏటా రూ.1,500 కోట్లను బడ్జెట్‌లో అదనంగా కేటాయింపులు చేయడం ద్వారా అందజేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) అధికారులు సీఎం చంద్రబాబునాయుడుకు నివేదించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం సీఎం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు కోరారు.