సాక్షి, అమరావతి: విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి తల్లిదండ్రుల ఒత్తిడి కూడా కారణమవుతోందని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రేమ వైఫల్యంతోనూ చనిపోవడానికి సిద్ధమవుతున్నారన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, ట్రాఫిక్ నియంత్రణ వంటి సామాజిక సేవల్లో భాగస్వామ్యం కల్పించి వారిపై ఒత్తిడి తగ్గిస్తామన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై శాసనసభలో 344వ నిబంధన కింద చేపట్టిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. ఒత్తిడి, మానసిక బలహీనత, కుటుంబ, వ్యక్తిగత సమస్యలు, హాస్టళ్లలో ఉండలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సీట్లు సాధించాలని కార్పొరేట్ కాలేజీల్లో చేర్చుతున్నారన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ తరగతులు, స్టడీ అవర్‌లు, గ్రేడింగ్‌ల పేరుతో కళాశాలలు ఒత్తిడి చేస్తున్నాయని చెప్పారు. గత నెలలో కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించామని, విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించామని తెలిపారు. అమెరికాలో అత్యున్నత విద్యా విధానం అమల్లో ఉందని.. అక్కడ తరగతి గదిలో నేర్చుకునే పాఠాలను క్షేత్ర స్థాయి పరిస్థితులకు అన్వయిస్తారని వెల్లడించారు. రాష్ట్రంలోనూ అదే విధానం అమలుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
అసెంబ్లీ నుంచే తెలుగు అమలు కావాలి: తెలుగు భాష అమలు చట్టసభల నుంచే మొదలవ్వాలని, అప్పుడే అది కింది స్థాయిలో అమలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో బుధవారం ఆయన ప్రాధాన్యతా అంశాల చర్చలో మాట్లాడారు. తెలుగు భాషా సంస్కృతి, పరిరక్షణ కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని, ఈ కమిటీ నివేదిక ఆధారంగా అమలుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీలు మారినంత ఈజీగా తెలుగు మీడియంను ఇంగ్లిషు మీడియంగా మార్చేశారని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వానికి చురకలంటించారు.
నా వల్లే హైదరాబాద్‌కు మెట్రో రైలు
సీఎం నారా చంద్రబాబునాయుడు
హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు తన వల్లే వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. బుధవారం అసెంబ్లీ కారిడార్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ హైదరాబాద్‌కు మెట్రో ప్రాజెక్టు తీసుకురావడానికి అప్పట్లో తాను ఎంతో పోరాటం చేశానన్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం మెట్రో రైల్ ప్రాజెక్టును బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలకే పరిమితం చేస్తే తాను హైదరాబాద్‌ను చేర్పించానని తెలిపారు. ఢిల్లీ మెట్రో ఎండీ శ్రీధరన్‌తో కూడా హైదరాబాద్ మెట్రోపై అధ్యయనం చేయించానని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో తన ముద్ర పోయేది కాదన్నారు. ప్రస్తుతం జీఈఎస్ సదస్సు జరుగుతున్న హెచ్‌ఐసీసీ, శంషాబాద్ విమానాశ్రయం అన్నీ తన హయాంలో వచ్చినవేనన్నారు. మెట్రో రైలును తాను ప్రారంభించకపోయినా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానన్న సంతృప్తి ఉందన్నారు.
1 నుంచి 10 వరకు తెలుగు తప్పనిసరి
రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని అన్ని మాధ్యమాల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం జీఓ నంబర్ 90 విడుదల చేశారు. గతంలో ఇచ్చిన జీవోలో ఇందుకు సంబంధించిన నిబంధనలు సవరిస్తూ ఈ కొత్త జీవో ఇచ్చారు. రాష్ట్రంలో ఏ ఇతర మాధ్యమాల్లో చదువుతున్న విద్యార్థులైనా ఒకటి నుంచి పదో తరగతి వరకు ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరిగా చదవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆరు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
రాష్ట్ర అసెంబ్లీలో ఆరు బిల్లులకు బుధవారం సభ ఆమోదం తెలిపింది. వీధి కుక్కలు, పందుల నిర్మూలన విషయంలో పంచాయతీలకు అధికారం కల్పిస్తూ పంచాయతీరాజ్ చట్టం సవరణ, భూ వినియోగ మార్పిడి చట్టం సవరణ, సీఆర్‌డీఏ సవరణ, లేఔట్ల అనుమతుల కోసం మున్సిపాల్టీల సవరణ బిల్లు, నివాస, నివాసేతర గృహాల అద్దె బిల్లు, న్యాయవాద సంక్షేమ నిధి సవరణ బిల్లులు ఆమోదం పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment