
రూ.268 కోట్లు తాగేశారు!
సాక్షి,హైదరాబాద్: కొత్త సంవత్సర ప్రారంభాన్ని మందుబాబులు మస్తు మజా చేశారు. డిసెంబరు 30, 31 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా రూ.268 కోట్ల విలువైన మద్యం తాగేసి పండగ చేసుకున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఐదు లక్షల కేసుల ఐఎంఎల్ మద్యం, 2.55 లక్షల కేసుల బీర్లు అమ్ముడయినట్లు ఆబ్కారీ శాఖ లెక్కగట్టింది. ఇదే నెల 28, 29 తేదీలతో పోలిస్తే ఇది దాదాపు 40 శాతం ఎక్కువ అని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. తమ అంచనాలకు మించి మద్యం అమ్మకాలు జరగడంతో వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో మూడు ఫుల్లు..ఆరు హాఫులు అన్న చందంగా మద్యం విక్రయాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగువేల పైచిలుకు లెసైన్సుడు మద్యం దుకాణాలు, మరో 1600 బార్లున్నాయి. వీటి వద్ద 30, 31 తేదీల్లో రద్దీ తీవ్రంగా ఉంది. ఇక రిసార్ట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు,ఫంక్షన్‌హాళ్లలోనూ వందలాది మంది ఈవెంట్ పర్మిట్లు తీసుకొని నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. వాటిల్లోనూ మద్యం ఏరులై పారింది.