నయవంచన
- ఎన్నికల హామీలు గాలికి
- బాబు పాలన ఏడాది గడచినా అమలుకాని వైనం
- 12 సార్లు పర్యటించినా ప్రయోజనం శూన్యం
- అయోమయంలో రైతులు, సాధారణ జనం
సాక్షి, ప్రతినిధి తిరుపతి : సీఎం చంద్రబాబు జిల్లా ప్రజలను నట్టేట ముంచారు. ‘ఓటు’ దాటాక హామీలను తగలేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడచినా జిల్లా ప్రజలకు ఒరిగిందేమీలేదు. స్థానిక ప్రజానీకాన్ని మరోసారి నయవంచన చేశారు. ఏడాది పాలనలో, ఆయన జిల్లాలో 12 మార్లు పర్యటించినా ప్రయోజనం లేకపోయింది.
హామీలివే..
- ముఖ్యమంత్రిగా జూన్ 16, 17, 18 తేదీల్లో పర్యటించినప్పుడు హంద్రీ-నీవా నీళ్లు ఫిబ్రవరి నాటికే కుప్పానికి తీసుకొస్తానని, జిల్లా ప్రజల దాహార్తి తీర్చుతానని హామీ ఇచ్చారు. అది ఆచరణలో సాధ్యం కాలేదు. జిల్లాలోని 49 మండలాల్లో తాగునీటి సమస్య తాండవిస్తోంది. 2,235 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
- డిసెంబర్ 11న చిత్తూరులో జరిగిన రైతు సదస్సులో చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులకు బకాయిలను రెండు రోజుల్లో చెల్లిస్తామన్న బాబు ఆ హామీని ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు.
- కుప్పంలో నిర్మించ తలపెట్టిన విమానాశ్రయానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
- తిరుపతి, చిత్తూరును స్మార్ట్ సిటీలుగా తీర్చిదాద్దుతామన్న హామీ కార్యరూపం దాల్చలేదు.
- జిల్లాను పారిశ్రామిక, హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్న మాటలు నీటిమూటలుగా మారాయి.
- తిరుపతి, కాళహస్తి, కాణిపాకంను హెరిటేజ్ కారిడార్‌గా తీర్చి దిద్దుతామని చెప్పినా అది ప్రతి పాదన దశలోనే ఉంది.
- జిల్లాలో ఇప్పటి వరకు కొత్త రోడ్లు మంజూరు కాలేదు.
- ప్రాజెక్టులు పూర్తి చేస్తానని...
జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులు హంద్రీ- నీవా, గాలేరు-నగరి, సుజల-స్రవంతి, సోమశిల- స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను పూర్తిచేసి తాగు, సాగు నీటి సమస్య లేకుండాచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్న సీఎం హామీ మాటలకే పరిమితమైంది. బడ్జెట్ కేటాయింపులో నామమాత్రంగా నిధులను కేటాయించి జిల్లా ప్రజలను మభ్య పెట్టారు.
ఉత్తుత్తి హామీలే..
జిల్లా వ్యాప్తంగా 2013 డిసెంబర్ నాటికి 8,70,321 మంది రైతులు రూ.11,180 కోట్ల రుణాన్ని తీసుకొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం 5.63 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో 4,48,773 మందిని మాత్రమే అర్హులుగా తేల్చారు. జిల్లాలో కేవలం రూ.1383 కోట్ల రుణాలు మాఫీ కాగా ఇప్పటివరకు రూ.456.44 కోట్లు మాత్రమే విడుదల చేయడం గమనార్హం.
- జిల్లాలో 62,792 డ్వాక్రా సంఘాలుండగా ఇందులో బ్యాంకు లావాదేవీలు 58,602 గ్రూపులు కొనసాగిస్తున్నాయి.
- వీరు రూ.1513 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని, ప్రతి మహిళకు రూ.10వేలు ఇస్తామని చివరకు 3వేల రూపాయలు ఇచ్చి వేలాది సంఘాలను డిఫాల్ట్ అయ్యేలా చేశారు.
బాబొచ్చినా జాబులేదు
- బాబు వస్తే జాబు ఇస్తామని జిల్లాలో 57,717 మంది నిరుద్యోగులను మభ్య పెట్టారు. 1793 మంది ఆదర్శరైతులు, గృహ నిర్మాణ శాఖలో 112 మంది, 300 మంది ఫీల్డ్ అసిసెంట్లను తొలగించారు.