ఏదీ.. ధరల స్థిరీకరణ నిధి
Published Wed, May 10 2017 7:10 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
దెందులూరు: ’రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.. ఏడాదికి రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తాం..’ ఇవి ఎన్నికల ముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పిన మాటలు, మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలు. అయితే ఈ మాటలు నీటిమీద రాతలుగానే మిగిలాయి. టీడీపీ ప్రభుత్వ పాలనకు మూడేళ్లు నిండినా ధరల స్థిరీకరణ ఊసేలేదు. దీంతో జిల్లాలోని సుమారు 6 లక్షల మంది రైతులకు అప్పుల బాధలు తప్పడం లేదు.
జిల్లాలో 6 లక్షల మంది రైతులు
జిల్లాలో దాదాపు 6 లక్షల మంది రైతులు పలు రకాల పంటలు సాగుచేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టో ప్రకారం మూడేళ్లకు రూ.15 వేల కోట్లు కేటాయించాల్సి ఉంది. అయితే ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. జిల్లాలో సుమారుగా వరి 5.50 లక్షల ఎకరాలు, మొక్కజొన్న లక్ష ఎకరాలు, మిర్చి 10 వేల ఎకరాలు, పొగాకు 30 వేల ఎకరాలు, కొబ్బరి 30 వేల ఎకరాలు, అరటి 25 వేల ఎకరాలు, నిమ్మ 25 వేల ఎకరాలు, పత్తి 8 వేల ఎకరాలు, ఆయిల్‌పామ్ 50 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధర ప్రకటిస్తోంది. ఆ మద్దతు ధర రైతుల వ్యవసాయ ఉత్పత్తుల ధర కంటే తక్కువ కావటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు కమీషన్‌దారులు, దళారుల వ్యవహారం మార్కెట్‌లో కీలకం కావడంతో వారిద్దరూ కుమ్మక్కై ధరలు తగ్గించి రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల వారీగా సమీక్ష, నియంత్రణ కొరవడటంతో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు.
దళారుల చేతిలో చిక్కుకుని..
మార్కెట్ వ్యవస్థ దళారుల చేతిలో చిక్కుకుపోయింది. ఓ పక్క గిట్టుబాటు ధర లేకపోవడం, మరో పక్క ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేయకపోవడంతో రైతులు, కౌలు రైతులు దళారుల చేతిలో బందీలుగా మారారు. జిల్లాకు వచ్చిన ప్రతిసారి సీఎం చంద్రబాబు జిల్లా రుణం తీర్చుకుంటాం అని పదేపదే చెబుతున్నా కనీసం స్థిరీకరణ నిధి ఏర్పాటుచేయకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది.
ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేయాలి
రైతులు పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలైన ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్, సివిల్ సప్లైస్ సంస్థలే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయంపైనే ఆధారపడ్డ లక్షలాది మంది రైతులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయాలి.
బి.నాని, రైతు, పోతునూరు
నిల్వ సదుపాయం లేదు
రైతు పండింని పంటకు నిల్వ చేసుకునే సౌకర్యం లేదు. ఈ దిశగా అధికారులు, ప్రజా ప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్యాన్ని అవలంబిస్తున్నారు. దీంతో దళారులు, కమీషన్‌దారులు కుమ్మక్కై వారి చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి తీసుకువస్తున్నారు.
టి.జమలయ్య, రైతు
శాశ్వత పరిష్కారం చూపాలి
గిట్టు భాటు ధర అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులకు వ్యవసాయం భారంగా మారింది. రైతు పండించే ఉత్పత్తులకు ఆమోదయోగ్యమైన గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి.
తిరుపతి రంగారావు, కౌలు రైతు
ఏడాదికి వెయ్యి కోట్లు నష్టం
ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయకపోవడంతో ఏటా జిల్లాలో ఆరు లక్షల మంది రైతులు సుమారు వెయ్యి కోట్ల వరకూ నష్టాన్ని చవిచూస్తున్నారు. దళారీ వ్యవస్థను నిరోధించటానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి కష్టానికి తగ్గ ఫలితంగా గిట్టుబాటు ధర కల్పించాలి.
కె.శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, కౌలు రైతుల సంఘం
Advertisement
Advertisement