ప్రజాస్వామ్యమా.. రౌడీల రాజ్యమా! : కల్పన
పామర్రు : శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం దారుణమని స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా టీడీపీ నాయకులు వ్యవహరించారని మండిపడ్డారు.
ఇది ప్రజాస్వామ్యమా.. రౌడీ రాజ్యమా.. అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఓట్లు దండుకుని, ఇప్పుడు మాటమార్చారని, మహిళలు, రైతులను మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగులకు నెలకు రూ.2వేలు చొప్పున భృతి చెల్లిస్తామని ఇంతవరకు దానిగురించి పట్టించుకోలేదని పేర్కొన్నారు. రైతుల రుణాలు రూ.1,01,816 కోట్లు ఉండగా కేవలం రూ.35వేల కోట్లు మాత్రమే మాఫీ చేయడం వల్ల రైతులకు ఏ విధమైన ప్రయోజనం చేకూరుతుందని ప్రశ్నించారు.
రుణమాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్‌చేశారు. పూర్తిస్థాయిలో రుణాలను మాఫీ చేయకపోతే రైతులు, డ్వాక్రా సభ్యులతో కలిసి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. మరో ఐదేళ్ల వరకు ఎటువంటి ఎన్నికలు లేవనే చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఏనాడు రైతులు సాగునీటికి ఇబ్బంది పడలేదని తెలిపారు.
ఆటవికచర్య : నాగిరెడ్డి
వైఎస్సార్ సీపీ రైతువిభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి జిల్లాలోనే ఏకైక మహిళా ఎమ్మెల్యే అయిన ఉప్పులేటి కల్పన, జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి, మహిళా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు కలిసి మహిళలు, రైతుల కోసం నిరసన వ్యక్తంచేస్తుంటే అడ్డుకోవడ అటవిక చర్య అని విమర్శించారు.
తాతినేని పద్మావతి మాట్లాడుతూ చంద్రబాబు 1995లో డ్వాక్రా మహిళలకు రివాల్వింగ్ ఫండ్ రాకుండా అడ్డుకున్నారని, అదే విధంగా ప్రస్తుతం రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలుచేయకుండా మరోసారి ఆడపడుచులను మోసం చేశారని విమర్శించారు. పెదపారుపూడి జెడ్పీటీసీ సభ్యురాలు మూల్పూరి హరీష, తోట్లవల్లూరు ఎంపీపీ వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్‌లు డి.రోహిణి, రత్నాబాయి, సునీత పాల్గొన్నారు.