విజయం తథ్యం : భాను
- 132 అసెంబ్లీ స్థానాలు మావే
- సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ హవా
- జననేత జగన్‌కే పట్టం కట్టిన ఓటరన్న
- ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉదయభాను వెల్లడి
జగ్గయ్యపేట, న్యూస్‌లైన్ : సీమాంధ్రలో వైఎస్సార్ సీపీకి 132 అసెంబ్లీ స్థానాల్లో విజయం తథ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జగ్గయ్యపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సామినేని ఉదయభాను ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని తన స్వగృహంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సీమాంధ్ర ఓటర్లు పట్టం కట్టారని చెప్పారు. ఉద్యోగులు, కూలీలు, యువకులు, మహిళలు అంతా వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓటు వేశారన్నారు.
నాలుగున్నర సంవత్సరాలుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్, టీడీపీ నాయకులు అనేక విధాలుగా వేధించారని చెప్పారు. ప్రజలంతా వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని కుట్రపూరితంగా, అన్యాయంగా 16 నెలలు జైలులో పెట్టినప్పటికీ ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ప్రజల మధ్యకు వచ్చి ప్రజా ఉద్యమం చేశారన్నారు. మంచి పాలన కావాలని ప్రజలకు విశ్వాసం కల్పించారని తెలిపారు. దేశ చరిత్రలోనే ఒక మహిళ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత షర్మిలకే దక్కుతుందని గుర్తుచేశారు.
ప్రజల హృదయాల్లో వైఎస్సార్‌సీపీ...
ప్రజల మనసుల్లో వైఎస్సార్ సీపీ ఉందని, బుధవారం జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు ద్వారా ఆ విషయం స్పష్టం చేశారని భాను వివరించారు. వైఎస్సార్ కుటుంబం త్యాగాల కుటుంబమని చెప్పారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అధికార దాహం కోసం ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా.. ప్రజలు గమనించి వారికి ఏ ప్రభుత్వం కావాలో నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉండే నాయకత్వం కోసం, ప్రజా పరిపాలన కోసం జనం ఎదురుచూస్తున్నారన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ నమోదైందన్నారు.
నిత్యకృషీవలుడు జగన్...
జననేత జగన్‌మోహన్‌రెడ్డి నిత్యకృషీవలుడని, నెలలో 24 రోజులపాటు ప్రజలకు అందుబాటులో ఉంటారని భాను చెప్పారు. జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కైవసం చేసుకుంటారని, జగ్గయ్యపేటలోనూ వైఎస్సార్‌సీపీకే అనుకూలంగా ప్రజా తీర్పు రాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఓటర్లకు కృతజ్ఞతలు...
పార్టీ స్థాపించిన నాటి నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు నిత్యం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఓటర్లకు భాను కృతజ్ఞతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచిన ఓటర్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ షేక్ మదార్‌సాహెబ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చింకా వీరాంజనేయులు, నంబూరి రవి, కట్టా కోటేశ్వరరావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తుమ్మల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.