సత్వర న్యాయం కోసమే లోక్‌అదాలత్‌లు
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరిగే కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్‌అదాలత్‌ల లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. హైదరాబాద్ నగర సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ,ప్రగతి సేవాట్రస్టుల ఆధ్వర్యంలో ఆదివారం గౌలిపురా పటేల్‌నగర్ ప్లే గ్రౌండ్ లో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ న్యాయస్థానానికి వచ్చేవారిని నిరుత్సాహపరిచేలా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కక్షిదారులను ఒప్పించి తక్షణమే కేసులు పరిష్కరించడానికి లోక్‌అదాలత్‌లు ఉపకరిస్తాయన్నారు. విద్యాహక్కుపై అవగాహన పెంచుకోవాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు బస్తీల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. సదస్సులో రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రి బ్యునల్ న్యాయమూర్తి జస్టిస్ జి.యతిరాజులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నారాయణ, సిటీ సివిల్ కోర్టు తాత్కాలిక చీఫ్ జడ్జి ఆరవిందరెడ్డి, సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి జి. రాజగోపాల్, ప్రగతి సేవా ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ బి. ప్రతిభ పాల్గొన్నారు.
అలరించిన ‘సప్తస్వర సంగమం’: వనస్థలిపురం రాజీవ్‌గాంధీ పార్కులో ఆదివారం రాత్రి సప్తస్వర సంగమం వీనుల విందు చేసింది.సినీ,వర్ధమాన గాయనీగాయకులు సుమధుర గానంతో ఆహూతులను అలరించారు. యువ గాయకులు శ్రీనివాస్, కళ్యాణి, సాయికృష్ణ, శ్రీవిద్య, దివాకర్, పావని, సంపత్ పాల్గొన్నారు. సినీ నేపథ్య గాయకులు రావు బాలసరస్వతీదేవి, వి.రామకృష్ణ, వడ్డేపల్లి శ్రీనివాస్, డి.వి.మోహనకృష్ణ, మృదంగ విద్వాంసులు పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావులను ఘనంగా సన్మానించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.చంద్రకుమార్ మాట్లాడుతూ మంచిపని ఏదైనా హృదయపూర్వకంగా, నిస్వార్థంగా చేయాలన్నారు. ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, నవీన విద్యాసంస్థల చైర్మన్ సుభాన్‌రెడ్డి, సమాచార హక్కు కమిషనర్ విజయ్‌బాబు, కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, యువ నటులు కౌశిక్‌బాబు, ఆకృతి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.