సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్‌డీఎఫ్) ఏర్పాటైంది. ఇందులో సీపీఐ, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ (యూ), ఆర్‌ఎస్‌పీ, బీఎల్‌ఎఫ్, భారత జాతీయ ఉద్యమ సంఘం తదితర అనేక లౌకిక
ప్రజాసంఘాలు కలిసి టీఎస్‌డీ ఎఫ్‌ను ఏర్పాటు చేశాయి.
ఈ వేదికకు చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, కో కన్వీనర్లుగా పార్టీకొకరు చొప్పున ఉండాలని నిర్ణయించారు. రాష్ట్ర సమన్వయకర్తగా నైనాల గోవర్ధన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీఎస్‌డీఎఫ్ విధాన పత్రం, ఉమ్మడి కార్యాచరణను నాయకులు ప్రకటించారు. చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు.
కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంతృత్వ పాలనకు వ్యతిరే కంగా వామపక్ష పార్టీలు, లౌకిక ప్రజాస్వామిక సంస్థలు కలిసి ఈ వేదికను ఏర్పాటు చేశాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అదానీ, అంబానీ లాంటి కొద్దిమంది పెట్టు బడిదారులకు దోచిపెడుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ చేతిలో రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసమయ్యాయన్నారు. బీజేపీ మతోన్మాద విధా నాలు, బడా సంపన్న అనుకూల విధానాలు, పేదల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తామ న్నారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం అడ్డూ అదుపులేని అవినీతికి పాల్పడుతోందని దుయ్య బట్టారు.
తెలంగాణలో అవినీతి ప్రపంచ రికార్డు లను కూడా బద్దలు కొట్టిందన్నారు. ఈ అవినీతి తెలంగాణ ప్రజల పురోభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారిందని, అందుకే అంతా కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జువ్వాడి చలపతిరావు, సీపీఐ రాష్ట్ర నాయకులు బాల మల్లేశ్, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకుడు హన్మేష్, ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తుకారాం, ఇతర నాయకులు గుర్రం విజయ్ కుమార్, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టీఎస్‌డీఎఫ్ విధాన పత్రం ముఖ్యాంశాలు ఇవీ..
- ప్రతి మండలంలో అవసరమైనన్ని నాణ్యమైన పాఠశాలలు స్థాపించాలి.
- నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి ఐదు వేల మంది జనాభాకు ఒక రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని నెలకొల్పాలి.
- స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి.
- ప్రతి ఒక్కరికి ఉద్యోగ హక్కును కల్పించాలి. లేకుంటే నిరుద్యోగులందరికీ జీవించే నిరుద్యోగ భృతిని ఇవ్వాలి.
- భూమిలేని పేదలకు భూములను పంపిణీ చేయాలి. దళితులకు 3ఎకరాల భూమి ఇవ్వాలి.
- కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి.
- కుల ప్రాతిపదికగా జన గణన జరగాలి.
- చట్టసభల్లో బీసీలకు, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలి.
- కాళేశ్వరం, భగీరథ ప్రాజెక్టుల్లో జరిగిన భారీ అవినీతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి.
Comments
Please login to add a commentAdd a comment