సత్వర న్యాయానికి తోవ?
కాశీకి పోయినవారూ... కాటికి పోయినవారూ సమానమని ఒకప్పటి నానుడి. ప్రయాణ సౌకర్యాలు అంతంతమాత్రమైన కాలంలో సుదూర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగొచ్చేవరకూ జాడ, జవాబూ ఉండేవి కాదు మరి. ఇప్పుడా స్థితి మారింది. కానీ మన న్యాయస్థానాల్లో అప్పటికీ ఇప్పటికీ కేసుల జాప్యం తీరు ఒకలాగే ఉంది. ఈ నేపథ్యంలో కేసుల పరిష్కారానికి కాలావధిని సూచిస్తూ దిగువ కోర్టులకు సుప్రీంకోర్టు తాజాగా జారీచేసిన మార్గదర్శకాలు ఊరటనిస్తాయి. బెయిల్ పిటిషన్లపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని... చిన్న చిన్న నేరాల్లో మగ్గుతున్నవారి కేసులను ఆరునెలల వ్యవధిలో పరిష్కరించాలని సూచించింది. అలాగే అయిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను ఈ సంవత్సరాంతంలోగా పరిష్క రించమని తెలిపింది. తీవ్ర నేరాలకు పాల్పడినవారి విషయంలో సెషన్స్ కోర్టు రెండేళ్లలోగా విచారణ ముగించాలని కూడా స్పష్టం చేసింది. ఈ విషయంలో విఫ లమైన న్యాయాధికారులను గుర్తించి వారి వార్షిక రహస్య నివేదికల్లో ఆ సంగతిని పొందుపర్చాలని హైకోర్టులను ఆదేశించింది.
దశాబ్దాల తరబడి కేసులు సాగుతుండటం వల్ల సాధారణ పౌరులు పడే ఇబ్బం దులు అన్నీ ఇన్నీ కావు. ఒకసారి కోర్టు మెట్లెక్కితే ఏళ్ల తరబడి ఏ కేసైనా ఎడతెగని సీరియల్లా సాగడమే తప్ప దానికి అంతూ దరీ ఉండటం లేదు. అవి సివిల్ కేసులా, క్రిమినల్ కేసులా అన్న తేడా లేదు. ఏదైనా విచారణ మొదలుకొని ముగిం పుకొచ్చేవరకూ అది వాయిదాలపైన వాయిదాలు పడుతూనే ఉంటుంది. ఇందువల్ల కక్షిదారులకు ఎదురయ్యే వ్యయప్రయాసలు అన్నీ ఇన్నీ కాదు. జైళ్లలో మగ్గుతున్న వారి స్థితి మరింత దుర్భరం. దాన్నుంచి విముక్తి ఎప్పుడో, అయినవారి చెంతకు చేరేదెన్నడో తెలియక వారు పడే వేదన వర్ణనాతీతం. కింది కోర్టుల్లో అయిదేళ్ల కంటే ఎక్కువకాలంనుంచి పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల సంఖ్య 43,19,693 కాగా, 3,599మంది జైళ్లలో మగ్గుతున్నారు.
ఈమధ్య మీడియాలో వచ్చిన కథనాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. గత నెలలో జైలునుంచి విడుదలైన తారిఖ్ అహ్మద్ దార్ కశ్మీర్ వాసి. బహుళజాతి ఔషధ సంస్థలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తుం డగా 2005లో పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితుడిగా మార్చారు. 337మంది సాక్షులున్న ఈ కేసులో పోలీసులు ఒక్కటంటే ఒక్క అభియోగాన్ని కూడా నిరూపించలేకపోవడంతో చివరకు న్యాయస్థానం అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. పద్నాలుగేళ్ల ఎడతెగని నిర్బంధం తర్వాత 2012లో విడుదలైన ఆమీర్‌ఖాన్ అనే యువకుడి వ్యథ కూడా ఇదే. పోలీసులు పెట్టిన 19 కేసులూ వీగిపోయాయి. కానీ ఇందుకు 14 ఏళ్లు పట్టింది. అతడు జైల్లో ఉన్నకాలంలో తల్లిదండ్రులు మరణించారు. కుటుంబం చిన్నాభిన్నమైంది. ‘మేం అరెస్టయి, జైళ్లలో మగ్గి సర్వం కోల్పోయాం... పేలుడు ఉదంతాల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకూ, గాయపడినవారికీ కూడా అన్యాయమే మిగిలింది కదా’ అని వీరు వేసిన ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తుంది. ఈమధ్యే తెలంగాణకు చెందిన ఒక చీరల దొంగతనం కేసు నిందితుణ్ణి సుదీర్ఘ చెర నుంచి విడిపించడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సివచ్చింది. బందిపోట్లు, గూండాలూ, భూకబ్జాదా రులు వగైరాలపై ప్రయోగించాల్సిన ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాన్ని అతడిపై ప్రయో గించి ఏడాదిగా జైలుపాలు చేయడంపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశాక విడుదలయ్యాడు. ఇలాంటి కేసులు ఇంకెన్ని ఉన్నాయో ఊహకందదు. జైళ్లలో మగ్గు తున్నవారిలో అత్యధికులు నిరుపేదలు. కేవలం అందువల్ల మాత్రమే కేసుల్లో ఇరు క్కున్నవారు. ఏ పలుకుబడీ లేనివారు. న్యాయం ఎలా పొందవచ్చునో, అందుకు ఏం చేయాలో కూడా తెలియనివారు.
ఈ పరిస్థితిని మార్చాలనీ, అసంఖ్యాకంగా ఉండే కక్షిదారులకు నిర్ణీత కాల వ్యవధిలో న్యాయం లభించేలా చూడాలని సర్వోన్నత న్యాయస్థానమైతేనేమి, కొన్ని హైకోర్టులైతేనేమి గతంలో ప్రయత్నించకపోలేదు. న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతోపాటు తమవైపుగా ఇతరత్రా తీసుకోవా ల్సిన చర్యల గురించి కూడా అవి దృష్టి పెట్టాయి. ఎంత చేసినా ఆవగింజంతయినా మార్పు లేదు. క్రిమినల్ కేసుల్లో నిందితులు నిర్దోషులుగా తేలిన పక్షంలో దర్యాప్తు చేసిన అధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని మూడేళ్ల క్రితం సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇది కూడా ఒకరకంగా కేసుల విచారణలో జాప్యాన్ని నివారించేదే. క్రిమినల్ కేసుల్లో పోలీసుల దర్యాప్తు ఎంతకీ పూర్తికాకపోవడం, చార్జిషీటు దాఖలు చేయకపోవడం వల్ల నిజమైన దోషులు తప్పించుకోవడం, విలువైన సాక్ష్యాలు మటుమాయం కావడం రివాజుగా మారింది. అలాగే అక్రమంగా కేసుల్లో ఇరికించడం, ఆ తర్వాత వాటి అతీగతీ పట్టించుకోక పోవడమూ సర్వసాధారణమైంది. ఇలాంటి ధోరణులతో విచారణలో ఉండే ఖైదీలు అసంఖ్యాకంగా పెరిగిపోయి జైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. సివిల్ కేసుల తీరు తెన్నులూ ఇలాగే ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కూడా కేసుల సత్వర పరిష్కారంపై నిరుడు నిబంధనలు రూపొం దించింది. పిల్లల సంరక్షణ, భరణం చెల్లింపు, అద్దె బకాయిల చెల్లింపు వగైరా వివాదాలను తొమ్మిది నెలల్లో... విడాకుల కేసులు ఏడాదిలో... ఆస్తి వివాదాలు రెండేళ్లలో పరిష్కరించాలని దిగువ న్యాయస్థానాలకు సూచించింది. ఈ మాదిరి చర్యలతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. విచారణలో భాగంగా కోర్టులు అడిగే సమాచారం సుదీర్ఘకాలం తర్వాతగానీ లభించడం లేదు. చైనాలాంటి దేశాలు సైతం న్యాయస్థానాలను కంప్యూటరీకరించి ఎలాంటి కేసులోనైనా మూడు నెలల్లోపే దోష నిర్ధారణ చేసి శిక్షలు విధిస్తుండగా మనకేమైంది? ఎందుకు వెనకబడుతున్నాం? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి సారించాలి. న్యాయస్థానాల పనితీరు మెరుగుపడేందుకు దోహదపడితే, దర్యాప్తు జరిపే విభాగాలకు జవాబుదారీతనం అలవరిస్తే, అవి పారదర్శకంగా పనిచేసేలా చూస్తే ప్రస్తుత స్థితి మారుతుంది. నిరుపేదకు న్యాయం దక్కుతుంది.