రంగంలోకి చినబాబు
రేపు తిరుపతికి లోకేష్ రాక
ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమీక్ష
పోలింగ్ శాతం పెంచేందుకు యత్నాలు
దేశం కార్యకర్తల్లోనే అంత ర్యుద్ధం
తిరుపతి: తిరుపతి ఉపఎన్నికను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అభ్యర్థిపై పార్టీలో నెలకొన్న అసమ్మతి, ప్రభుత్వ వ్యతిరేకత నుంచి గట్టెక్కించేందుకు పార్టీ అధిష్టానం తంటాలు పడుతోంది. ఉప ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థికి ఎక్కువ శాతం ఓట్లు వస్తే ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా చూపుతుందనే ఉద్దేశంతో అధిష్టానం పకడ్బందీగా పావులు కదుపుతోంది. ఇప్పటికే మంత్రులు, ముఖ్యనేతలను రంగంలోకి దించింది. దీంతో పాటు ప్రస్తుతం పార్టీ శ్రేణులు అభ్యర్థికి సహకరించకపోవడంతో వారినంతా ఒక గూటికి తేవడానికి యువనేత లోకేష్ రంగంలోకి దిగుతున్నారు. ఈయన శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి చేరుకుంటారు. ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్లో పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు.
టీడీపీలో సద్దుమణగని గొడవలు
ప్రచారం సందర్భంగా టీడీపీలో గొడవలు జరుగుతూనే వున్నాయి. ఎన్నికల్లో డబ్బు పెత్తనం నాకంటే నాకని నాయకులు పోటీపడుతున్నారు. దీనిపై మంగళవారం పార్టీ అభ్యర్థి ముఖ్య అనుచరుడికి, ఇంకో పార్టీ నేతకు మధ్య గొడవ జరిగినట్టు కూడా సమాచారం. దీంతోపాటు బుధవారంలో ఆటోనగర్ ప్రచారంలో మాత్రం తమకు తెలియకుండా ప్రచారానికి వచ్చారంటూ మైనారిటీ నేతలు నిలదీశారు. ఇలా ప్రచారంలో గొడవలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీనిని చక్కదిద్దే విషయమై అధిష్టానం దృష్టి సారించకపోవడం గమనార్హం. దీంతోపాటు పోలింగ్ శాతం తగ్గుతుందనే గుబులు పార్టీ నేతలను పట్టిపీడిస్తోంది. ఎలాగైనా పోలింగ్ శాతం పెంచుకుని ఎక్కువ మెజార్టీ సాధించాలని అధిష్టానం ఇప్పటికీ ముఖ్య నేతలకు సూచించినట్టు సమాచారం. ఈమేరకు వారు ప్రణాళికను రచిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కాంగ్రెస్ ప్రచారం అంతంత మాత్రం
కాంగ్రెస్ పార్టీ ప్రచారం కూడా అంతంతమాత్రంగా కొనసాగుతోంది. టీడీపీలో అసమ్మతి, ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలు పెట్టుకుంది. మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి ఒంటరిగానే ప్రచారం చేస్తున్నారు. ముఖ్యనేతలు ఆమె ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. పరువు పోకుండా కొద్దిమేరకైనా ఓట్లు సాధించి పట్టును నిలుపుకోవాలని మాజీ ఎంపీ చింతామోహన్ కృతనిశ్చయంతో వున్నారు. డ్వాక్రా మహిళల ఓట్లపైనే ఆశలు పెంచుకున్నట్టు తెలుస్తోంది. పోలింగ్ గడువు సమీపిస్తున్నప్పటికీ నగరంలో ప్రచారం ఇంకా ఊపందుకోకపోవడం గమనార్హం.