12నుంచి లోకేష్ యువప్రభంజనం
కోనేరుసెంటర్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్ జిల్లాలో 12వ తేదీ నుంచి యువప్రభంజనం పేరుతో బస్సు ర్యాలీ నిర్వహించనున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎంపీ కార్యాలయంలో గురువారం స్థానిక నాయకులతో కలిసి ఉమా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జరిగిన జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ తొలి విడత ఎన్నికల్లో కనీస వసతులు లేక ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు.
రెండో విడత జరగబోయే ఎన్నికల్లోనైనా అధికారులు కనీస వసతులు కల్పించాలని కోరారు. 12వ తేదీ మధ్యాహ్యం 3 గంటలకు లోకేష్ నిమ్మకూరులోని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, బసవతారకమ్మల విగ్రహాలకు పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభిస్తారని చెప్పారు. అక్కడి నుంచి బస్సు ర్యాలీగా పామర్రు మీదుగా గుడివాడ చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారన్నారు.
అనంతరం కంకిపాడు మీదుగా విజయవాడ చేరుకుని అక్కడ జరిగే సభలో పాల్గొంటారన్నారు. ఆ రోజు రాత్రి విజయవాడలో బస చేసి అనంతరం గుంటూరుకు వెళతారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య , మోటమర్రి బాబాప్రసాద్, గోపు సత్యన్నారాయణ, చిలంకుర్తి తాతయ్య, నారగాని ఆంజనేయప్రసాద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, బత్తిన దాసు, సాతులూరి నాంచారయ్య పాల్గొన్నారు.