
ఆరోగ్య సిబ్బందిని ఆరా తీస్తున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో పార్ధసారధి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లాలో మరో కరోనా కేసు నమోదైంది. పద్మనాభం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. లండన్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న యువకుడు ఈ నెల 17న విశాఖలో తన స్వగ్రామానికి వచ్చాడు. అతనికి కరోనా లక్షణాలు ఉన్న కారణంగా ఈ నెల 20న ప్రభుత్వ అంటువ్యాధుల ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు ఆ యువకుడిని నమూనాలను పరీక్ష కోసం పంపించగా సోమవారం పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. దీంతో విశాఖలో కరోనా కేసులు మూడుకు చేరాయి. కాగా బాధితుడు విశాఖ వచ్చిన తరువాత ఎవరెవరిని కలిశాడన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. యువకుడి కుటుంబ సభ్యులు నలుగురితో పాటు, అతనికి సన్నిహితంగా మెలిగిన మరో 16 మందిని గుర్తించి వారిని ఐసొలేషన్ వార్డుకు తరలించారు. (కరోనాను అడ్డుకునే సామర్థ్యం భారత్ సొంతం)
ఏడు గ్రామాలు దిగ్భందం
పద్మనాభ మండలంలో కరోనా కేసు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తెల్లవారుజాము నుంచే బాధితుడి నివాస ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో పద్మనాభం మండలంలో 7 గ్రామాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు దిగ్బంధించారు. వెంకటాపురం గ్రామంలోకి ఇతరులెవరూ ప్రవేశించకుండా మార్గాలను మూసేశారు. రేవిడి పీహెచ్‌సీ వైద్యాధికారిణి ఎన్.వి.సమత, ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ డాక్టర్ భవానీ, జిల్లా కరోనా నివారణ నోడల్ అధికారి పార్థ్దసారధి, ఎంపీడీవో జి.వి.చిట్టిరాజు, తహసీల్దార్ వి.త్రినాథరావునాయుడు ఆయా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. వెంకటాపురానికి మూడు కిలోమీటర్లు పరిధిలో ఉన్న రేవిడి, అన్నంపేట, రౌతులపాలెం, కోరాడ, భీమునిపట్నం మండలంలో మజ్జిపేట, మజ్జివలస గ్రామాలకు వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన 60 బృందాలు ఇంటింటికి వెళ్లి స్థానికుల ఆరోగ్య వివరాలను సేకరించారు. జాగ్రత్తలను వివరించారు. స్థానికులు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. (ఐటీ ఉద్యోగులకు హోం ఐసోలేషన్)
ఆందోళన వద్దు.. నివారణకు చర్యలు: మంత్రి ముత్తంశెట్టి
పద్మనాభం : ప్రజలు కరోనాపై ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. వెంకటాపురంలో ఒకరికి కరోనా లక్షణాలు గుర్తించడంతో రేవిడి పీహెచ్‌సీని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకుంటుం దన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణతో పాటు సామాజిక భద్రత పాటించాలన్నారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ మండల శాఖ అధ్యక్షుడు రాంబాబు, రమణ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment