సాక్షి, మహారాణిపేట(విశాఖ దక్షిణ): కొద్దిరోజుల క్రితం వరకు జిల్లాలో 20–25 మధ్యే ఉన్న కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా 66కు ఎగబాకాయి. కేసులు తక్కువగా ఉండటం.. వారిలో 95 శాతం మంది కోలుకొని డిశ్చార్జి కావడంతో.. వరుసగా కొన్ని రోజులు జీరో కేసులు నమోదు కావడంతో ఊపిరి పీల్చుకున్న జిల్లా యంత్రాంగం.. ఒక్కసారిగా కేసులు పెరిగిపోవడంతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఎందుకిలా జరిగింది.. ఈ పరిణామానికి కారకులెవరన్న దానిపై ఆరా తీసింది. అందులో తేలిందేమిటంటే.. ఒకే ఒక్కడు 20కిపైగా కేసుల నమోదుకు వాహకుడిగా మారాడని ప్రాథమికంగా వెల్లడైంది. నగరంలో తొలి పాజిటివ్ కేసులు పాతనగరంలోని అల్లిపురంలోనే నమోదైంది. ఆ తర్వాత అక్కయ్యపాలెం, ముస్లిం తాటిచెట్లపాలెం, న్యూకాలనీ, గాజువాక ప్రాంతాలతోపాటు జిల్లాలోని నర్సీపట్నం ప్రాంతాల్లో మొత్తం 23 కేసులు నమోదయ్యాయి. (డిశ్చార్జి చేయాలని కరోనా రోగి హల్‌చల్..?)
ఆ తర్వాత చాలారోజుల వరకు కొత్తవి నమోదు కాలేదు. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా విజృంభించాయి. అల్లిపురం తప్ప ఎక్కడా కేసులేని పాతనగరంలో ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో కేసుల వెలుగుచూసి స్థానికులను, అధికారులను వణికించాయి. తక్కువ రోజుల వ్యవధిలోనే కేసులు 66కు పెరిగిపోవడాన్ని
అధికారులు సీరియస్‌గా పరిగణించారు. కేసులు నమోదైన దిబ్బలపాలెం, తదితర ప్రాంతాల్లో ఆరా తీయడం మొదలుపెట్టారు. తొలుత 60 ఏళ్ల వృద్దురాలికి వైరస్ సోకడం, ఆ తర్వాత ఆదే ఇంటిలో ఆమె కుమారుడికి కూడా వ్యాపించింది. అక్కడి నుంచి చుట్టుపక్కల, ఇరుగుపొరుగు ఇళ్లవారు కూడా వైరస్ బాధితులుగా మారారు. జగదాంబ జంక్షన్ సమీపంలోని చందక వీధి, దండుబజార్, దిబ్బలపాలెంలలో 20కి పైగా కేసులు నమోదయ్యాయి.
ఆ సమీపంలోని తాడివీధిలో మరో కేసు వెలుగు చూసింది. ఎవరి ద్వారా ఇది వ్యాప్తి చెందిందన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. స్థానికుల నుంచి పూర్తి వివరాలు సేకరించి.. కేంద్ర భద్రతా బలగాల్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తిని కరోనా వాహకుడిగా ప్రాథమికంగా గుర్తించారు. చెన్నైలో పనిచేస్తున్న సదరు వ్యక్తి సుమారు నెలన్నర క్రితం దండుబజార్ ప్రాంతంలోని చందక వీధిలోని తన ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి ఇంట్లో ఇరుగుపొరుగువారు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో యథేచ్ఛగా పేకాట, హౌసీ వంటి ఆటలు నిర్వహించాడు. ఫలితంగానే వైరస్ విజృంభించినట్లు వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా వ్యాప్తి చేసే వారిని కేంద్ర ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్, స్ప్రెడర్లు(వాహకులు)గా గుర్తిస్తోంది. అదే కోవలో ఈ వ్యక్తిని స్ప్రెడర్‌గా అధికారికంగా గుర్తించే ప్రక్రియను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment