- కలెక్టర్లతో 10 గంటల పాటు సాగిన సీఎం చంద్రబాబు భేటీ
- హాజరైన రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ శాఖ ముఖ్య కార్యదర్శులు
- భవిష్యత్తు అభివృద్ధిపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం నగరం వేదికగా రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో జరిపిన తొలి అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశం సుదీర్ఘంగా సుమారు పది గంటలపాటు సాగింది. 13 జిల్లాల కలెక్టర్లు, వివిధ రేంజ్‌ల ఐజీ, డీఐజీ, ఎస్పీలతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. నూతన ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరాక నిర్వహించిన మొదటి కలెక్టర్ల సదస్సు కావడంతో సుదీర్ఘంగా సాగింది. ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించడానికే ఎక్కువ సమయం కేటాయిం చారు. గేట్‌వే హోటల్‌లో ఉదయం 10.15 నిమిషాలకు ప్రారంభమైన సదస్సు అర్ధరాత్రి వరకు కొనసాగింది.
సాదర స్వాగతం
హైదారాబాద్ నుంచి గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబుకు మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా సదస్సు జరిగే హోటల్‌కు చంద్రబాబు చేరుకొని ఉదయం 10.15 నిమిషాలకు సమీక్ష మొదలుపెట్టారు. తొలుత ముఖ్యమంత్రి సుమారు గంటన్నరకు పైగా మాట్లాడారు.
అధికారులు అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని మొదలుపెట్టి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం, రైతు రుణమాఫీ, మొదలుకొని ఇసుక మాఫియా వరకు అన్నింటిపై ప్రసంగించారు. ఏడు అంశాలను ప్రాధాన్యత అంశాలుగా గుర్తించామని వీటిని మిషన్‌గా భావించి అందరు సీరియస్‌గా పనిచేయాలని హితబోధ చేశారు. ఏడు మిషన్లకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారని ఆయా మిషన్లకు సంబంధిత శాఖల మంత్రులు వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని సీఎం చెప్పారు.
విజన్-2029తో ముందుకు వెళ్తున్నామని, దీనికి అధికారులందరూ సహకరించి పనిచేస్తేనే లక్ష్యాలు సాధించగలుగుతామని చెప్పారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు ప్రసంగించారు. పలు అంశాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రితో పాటు పూర్తి మంత్రివర్గం, అన్ని ప్రధాన ప్రభుత్వ శాఖ ముఖ్య కార్యదర్శులు సమీక్షలో పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం కలెక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు.
13 జిల్లాలో ప్రసుత్తం ఉన్న పరిస్థితులు అన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ఆ తర్వాత ఐపీఎస్ అధికారులతో వేరుగా సమావేశం నిర్వహించారు. వివిధ రేంజ్ ఐజీ, డీఐజీలు, ఎస్పీలు హజరయ్యారు. జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, పెండింగ్ కేసులు, స్టేషన్లకు వచ్చే బాధితులతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇలా పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పోలీసులకు తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు.
సమీక్షకు హాజరైన రాష్ట్ర మంత్రులు, కలెక్టర్లు
ఉపముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, ఎన్ చినరాజప్ప, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కిషోర్‌బాబు, పరిటాల సునీత, సిద్ధా రాఘవరావు, కొల్లు రవీంద్ర, పైడికొండల మాణిక్యాలరావు, కిమిడి మృణాళిని, అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్, పత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, నారాయణ, దేవినేని ఉమ, యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్లు ఎం. రఘనందనరావు (కృష్ణా), కాంతిలాల్ దండే(గుంటూరు), సిద్దార్థజైన్ (చిత్తూరు), నీతూప్రసాద్ (తూర్పుగోదావరి), సీహెచ్ విజయ్‌కుమార్ (కర్నూలు), ఎన్.శ్రీకాంత్ (నెల్లూరు), జిఎస్‌ఆర్‌కెఆర్ విజయ్‌కుమార్ (ప్రకాశం), గౌరవ్ ఉప్పల్ (శ్రీకాకుళం), సాల్మన్ ఆరోగ్యరాజ్ (అనంతపురం), ఎన్.యువరాజ్ (విశాఖపట్నం), నాయక్ (విజయనగరం), కె.భాస్కర్ (ప.గో), కేవీ రమణ (వైఎస్సార్ కడప జిల్లా) సమావేశానికి హాజరయ్యారు.