ఆలయం వద్ద భక్తుల సందడి
– మూడు గంటల్లో శ్రీవారి దర్శనం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి హుండీ కానుకలు సోమవారం రూ.4.24 కోట్లు లభించాయి. ఈ ఏడాదిలో ఒకరోజు హుండీ కానుకల్లో జూలై 18వ తేదిన రూ.4.69 కోట్లు, జూన్ 27వ తేదిన రూ.4.22 కోట్లు, జూలై 11వ తేదిన 4.03 కోట్ల మేర లభించాయి. ఇటీవల శ్రీవారి హుండీ కానుకలు రూ.3 కోట్ల నుండి రూ. 4 కోట్ల వరకు లభిస్తుండటం గమనార్హం. ఏటా హుండీ ద్వారా రూ.వెయ్యికోట్ల నగదు, 800 కేజీల బంగారం, 1500 కేజీల వెండితోపాటు భారీగా విదేశీ కరెన్సీ లభిస్తోంది. ఇలా ఏటా రూ.1300 కోట్లమేర హుండీ కానుకలు లభిస్తున్నట్టు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి.
మూడు గంటల్లో శ్రీవారి దర్శనం
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తగ్గింది. మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం లభిస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు 49,550 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనానికి 3 గంటలు , కాలిబాట భక్తులకు 3 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. గదులు ఖాళీ ఉన్నాయి.