తిరుమల: లడ్డూ అమ్మకాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రికార్డును సృష్టించింది. మే నెలలో దాదాపు 92.27 లక్షల లడ్డులను టీటీడీ భక్తులకు వితరణ చేసింది. 2013లో 72.33 లక్షలు, 2014లో 80.84 లక్షలు, 2015లో 89.84 లక్షల లడ్డులను మే నెలల్లో టీటీడీ భక్తులకు అందించింది. వేసవి సెలవులు కావడంతో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. శనివారం క్యూ లైన్లలో తోపులాట జరగడంతో టీటీడీ ఈవో డా. దొండపాటి సాంబశివరావు ఆ ప్రదేశాలను స్వయంగా సందర్శించి అదనపు సిబ్బందిని నియమించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 67,113 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, కాలినడక భక్తులకు 8 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది.