ఇంటిలోకి దూసుకెళ్లిన లారీ
కోవెలకుంట్ల : సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఇంటిలోకి దూసుకెళ్లడంతో హరికిషన్‌రెడ్డి(13) మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని కోవెలకుంట్ల- బనగానపల్లె ఆర్‌అండ్‌బీ రహదారిలో ఆదివారి అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. శివ స్పోర్స్ యజమాని సుబ్బారెడ్డి ఆర్‌అండ్‌బీ రహదారి పక్కన ఉన్న ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు.
ఆదివారం రాత్రి కుటుంబ సమేతంగా భోజనం చేసి వరండాలో మంచాలు వేసుకుని నిద్రకు ఉపక్రమించారు. బనగానపల్లె వైపు నుంచి సిమెంట్ బస్తాల లోడ్‌తో వస్తున్న టీఎన్ 23 బీఎఫ్ 8592 అను నంబర్ గల లారీ కోవెలకుంట్లవైపు అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి సుబ్బారెడ్డి ఇంటిలోకి దూసుకొచ్చింది. దీంతో రెండు మంచాలపై నిద్రిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులపై ఇంటి గోడ రాళ్లు, దంతెలు విరిగి పడటంతోపాటు లారీ రెండు మంచాలను నుజ్జునుజ్జు చేసింది.
సుబ్బారెడ్డి కుమారుడు హరి కిషన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా ఆయనతో పాటు భార్య కవిత, మరో కుమారుడు రఘురామిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. లారీ ఇంటిలోకి దూసుకెళ్లడం, పెద్ద శబ్ధం రావడం, క్షతగాత్రులు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు హుటాహుటినా అక్కడికి చేరుకుని గోడ రాళ్లు, దంతెలను తొలగించి అందులో ఇరుక్కపోయిన వారిని బయటకు తీశారు. అప్పటికే హరికిషన్‌రెడ్డి మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108 వాహనంలో కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సుబ్బారెడ్డి భార్య, కుమారుడికి స్థానిక ఆసుపత్రిలో ప్రాథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా వాహనాన్ని నడపడంతోనే ఈ దారుణం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలం నుంచి లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. ఈ సంఘటనతో కోవెలకుంట్లలో విషాదం నెలకొంది. మృతి చెందిన హరికిషన్‌రెడ్డి జిల్లా మిల్క్‌డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డికి మనవడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుబ్బరాయుడు పేర్కొన్నారు.