- ప్రభుత్వ వైఫల్యమే కారణం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిర్వాకం వల్ల 13వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం నుంచి గ్రాంటు రూపంలో రావాల్సిన రూ.700 కోట్లను రాష్ట్రం కోల్పోయింది. నిధుల వినియోగానికి సంబంధించి సకాలంలో వినియోగ పత్రాలను సమర్పించడంలో ప్రభుత్వం విఫలం కావడమే ఇందుకు కారణం. ఆర్థిక సంవత్సరం చివరిరోజు మంగళవారం అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఖజానాకు మొత్తం రూ.5,000 కోట్లు విడుదలయ్యాయి.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ నుంచి గట్టెక్కింది. అయితే చేబదులు నుంచి ఇంకా గట్టెక్కలేదు. ఓవర్ డ్రాఫ్ట్ నుంచి గట్టెక్కడం తో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను చెల్లించాలని నిర్ణయించారు. తాజాగా విడుదలైన నిధుల్లో రెగ్యులర్‌గా రావాల్సిన 13వ ఆర్థిక సంఘం నిధులు కూడా ఉన్నప్పటికీ ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెచ్చుకోలేకపోయింది. 13వ ఆర్థిక సంఘం కింద మంగళవారం రాత్రి రూ.309 కోట్లను మాత్రమే కేంద్రం విడుదల చేసింది. మరో రూ.700 కోట్లు రావాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆ నిధులు విడుదల కాలేదు.
13వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగిసిపోవడంతో ఇక ఆ నిధుల గురించి మరిచిపోవాల్సిందే. ఈ రూ.700 కోట్లలో కొన్ని నిధులు స్థానిక సంస్థలకు, మరికొన్ని నిధులు ప్రత్యేక అవసరాల కోసం ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.12,000 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. కేంద్రం రెండు దశల్లో కలిపి రూ.2,300 కోట్లు విడుదల చేసింది. గత నెల తొలివారంలో రూ.500 కోట్లు, మంగళవారం రాత్రి రూ.1,800 కోట్లు విడుదల చేసింది.