
ప్రేమ విషాదాంతం
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాదని..
బావిలో దూకి బాలిక ఆత్మహత్య
స్నేహితుడి ఆత్మహత్యాయత్నం
తెలిసీతెలియని వయసు వారిది. ఇద్దరిదీ ఒకే కాలనీ. ఒకరు తొమ్మిదో తరగతి.. మరొకరు ఇంటర్మీడియెట్ సెకండియర్. వారి మధ్య ఏర్పడిన ఆకర్షణ ప్రేమగా మారింది. ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. పెళ్లికి అతడు నిరాకరించడంతో బాలిక మనస్తాపం చెందింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాదని క్షణికావేశానికి లోనై బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బాలిక అదృశ్యమైనట్లు తెలిసిన సదరు ప్రేమికుడు క్రిమిసంహారక మందు తాగాడు. ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నార్నూర్ మండలం ఇందిరానగర్‌లో జరిగిన ఈ సంఘటన వారిద్దరి కుటుంబాల్లో విషాదం నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నార్నూర్, న్యూస్‌లైన్ :
మండలంలోని ఇందిరానగర్‌కు చెందిన చెన్నే శ్యామల(14), అదే కాలనీకి చెందిన గవ్వాలే రాజేశ్వర్ (19) ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. శ్యామల మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రాజేశ్వర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ సెకండియర్ చదువుతూనే ప్రైవేటు వాహనాల డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం శ్యామల అమ్మ రాధ వ్యవసాయ పనులకు, నాన్న లింగయ్య సొంతూరు లక్సెట్టిపేటకు వెళ్లారు. ఈ సమయంలో శ్యామల ఇంటికి రాజేశ్వర్ వచ్చాడు. ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. తనకు వేరే అమ్మాయితో సంబంధం కుదిరిందని, తాను పెళ్లి చేసుకోనని రాజేశ్వర్ పేర్కొనగా కచ్చితంగా తననే చేసుకోవాలని శ్యామల పట్టుబట్టింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని శ్యామల తమ్ముడు తెలిపాడు. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగదని మనస్తాపం చెందిన శ్యామల బహిర్భూమికని వెళ్లి ఇంటికి చేరలేదు. సాయంత్రం ఇంటికొచ్చిన తల్లిదండ్రులు కూతురు కనిపించకపోవడంతో వెతకసాగారు. శ్యామల అదృశ్యమైనట్లు తెలిసిన రాజేశ్వర్ రాత్రి ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో వ్యవసాయ బావి వద్ద చున్నీ, చెప్పులు ఉండడంతో కుటుంబ సభ్యులు మోటార్ సాయంతో నీటిని తోడించగా శ్యామల మృతదేహం తేలింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మరోవైపు రాజేశ్వర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
కుటుంబాల్లో విషాదం..
రాధ, లింగయ్య దంపతులకు ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా శ్యామల నాల్గో కుమార్తె. ఆమె మృతితో కుటుంబ సభ్యుల రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. మరోవైపు రాంచందర్, అంజనాబాయి దంపతులకు ఒక్కగానొక్క కొడుకు రాజేశ్వర్. తల్లి వద్ద ఉంటున్న అతడు ఆత్మహత్యకు యత్నించి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడంతో అంజనాబాయి కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ధారం సురేశ్ పేర్కొన్నారు.