ఆకాశం మబ్బులు పడుతుంది. అయితే వర్షం కురవడం లేదు. తొలకరి పలకరించినా నైరుతి ప్రభావం కనిపించలేదు. రుతుపవనం మందగమనంగా సాగుతోంది. జూన్ మొదటి వారంలో రావాల్సిన నైరుతి పవనాలు 20 రోజులు ఆలస్యంగా పలకరించినా ప్రభావం చూపలేదు. జూలై 20వ తేదీన జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురవడంతో అన్నదాతలు సేద్యానికి ఉపక్రమించారు. వారం రోజల నుంచి మళ్లీ వర్షాలు పడలేదు. ఆకాశం మేఘాలతో నిండి ఉంటున్నా చినుకు చుక్క పుడమి తల్లిని తాకడంలేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, ఉదయగిరి: జిల్లాలో అధిక వర్షపాతం ఈశాన్య రుతుపవనాల ద్వారా నమోదువుతుంది. జూన్, జూలైలో కురిసే వర్షాలే ఖరీఫ్ పంటకు ప్రాణంగా నిలుస్తాయి. సాధారణంగా జూన్ 1,2 తేదీల్లో నైరుతి పవనాలు కేరళను తాకి వారం రోజలు వ్యవధిలో లేదంటే 10 రోజుల్లో జిల్లా అంతటా విస్తరించి వాతావరణం చల్లబడి వర్షాలు పడేవి. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు కదిలిక, గమనం గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా ఆలస్యంగా జూన్ 25వ తేదీ వరకు సమయం తీసుకున్నాయి. అప్పుడైనా వర్షాలు కురిశాయా అంటే అదికూడా లేదు.
గతి తప్పిన రుతుగమనం
జూన్ మొదటి వారంలో ఆరేబియా సముద్రంలో ’వాయు’ తుపాను కారణంగా నైరుతి రుతుపవనాల కదిలికకు అంతరాయం ఏర్పిడింది. అది గుజరాత్ వద్ద తీరం దాటకుండా ఓమెన్ వైపు ప్రయాణించడంతో ఈ పరిస్థితి వచ్చిందని వాతావరణ నిపుణలు అంచనా వేశారు. ఆ తర్వాత కోస్తా ఆంధ్రా ప్రాంతానికి దగ్గరగా పశ్చమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం, ఉత్తర బంగాళా ఖాతంలో మరో ఆవర్తనం కారణంగా జూన్ మొదటి వారంలో రావాలిసిన నైరుతి పవనాలు ఆ నెల 25వ తేదీ వరకు సమయం తీసుకున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఆపైన రుతు పవనాల ప్రభావం జిల్లాపై అంతగా చూపలేదు. నైరుతి విస్తరించి జిల్లా అంతటా వర్షాలు పడాల్సి ఉన్నా, ఆ పరిస్థితి కనిపించలేదు. మే నెల్లో సాధారణ వర్షపాతం 107.4 మీ.మీ. కాగా, కేవలం 4.6 మీ.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. జూన్‌లో 56.8కి గానూ 12.9 మీ.మీ. వర్షం మాత్రమే కురిసింది. ఈ నెల్లో ఇంతవరకు 139.3గానూ 101 మాత్రమే వర్షపాతం నమోదైంది. అంటే జిల్లా వ్యాప్తంగా ఇప్పుటి వరకు –27.5 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో ద్వితీయ పక్షంలో ఉదయగిరి మెట్టప్రాంతంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడడంతో మెట్ట రైతులు పంటలు వేసేందుకు ముందుస్తు దుక్కులు దున్నుతున్నారు. అక్కడక్కడా కంది సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
లక్ష ఎకరాల్లో మెట్ట పైర్లు
ఆగస్టు, సెప్టెంబర్‌లో మంచి వర్షాలు కురిస్తే సుమారు లక్ష ఎకరాల్లో మినుము, పెసర, కంది తదితర మెట్ట పైర్లు సాగు చేస్తారు. ఈ రెండు నెలల్లో కురిసే వర్షాలు ఆధారంగా చెరువులు, కుంటలు, జలాశాయల్లో నీరు చేరికను బట్టి ఖరీఫ్ వరి సాగు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి గమనిస్తే ప్రధాన జలాశయం సోమశిల పూర్తిగా అడుగంటిపోయింది. గండిపాళెం, నక్కలగండి, కండలేరు తదితర జలాశయాలు నిండుకున్నాయి. గత రెండు రోజలు నుంచి మళ్లీ ఆకాశం మేఘావృతం అవుతెంది. ఆదివారం జిల్లా అంతటా దట్టమైన మేఘాలతో ఆకాశం ఆవరించి వర్షం కురుస్తుందనే భావన కలిగించింది. నీటి చుక్క నేలనైతే తాక లేదు. మరి వరుణదేవుడు కరిణస్తాడో... లేక మబ్బులతో దోబూచులాడి ఉస్సూరమనిపిస్తాడో లేక అన్నదాత ముఖాల్లో ఆనందం కురిపిస్తాడో వేచి చూడాలి.
ఊరిస్తూ..
వాకాడు: జిల్లాలో వర్షాలు సకాలంలో కురవక పోవడంతో వ్యవసాయం గత ఐదేళ్లుగా కన్నీళ్ల సేద్యంగా మారింది. ఎండిపోయిన జలాశయాలు, అడుగంటిపోయిన భూ గర్భజలాలు వెరసి ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. అయినా సరే సాగు విషయంలో మాత్రం రైతులు వెనకడుగు వేయడంలేదు. ఈ ఏడాదైనా పంట చేతికి రాకుండా పోతుందా..? అనే కొండంత ఆశతో రైతులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పడిన అరకొర వర్షాలతో రైతులు దుక్కులు సిద్ధం చేసుకుని విత్తుకునే సమయానికి వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారం రోజులుగా వాతవరణంలో మార్పు చోటు చేసుకుని వర్షం పడేలా నల్లని మేఘాలతో రైతులను ఊరిస్తూ నిరాశలోకి నెడుతున్నాడు.
వరుణుడుపైనే ఆశలు
గత మూడేళ్లు నుంచి ఖరీఫ్‌లో వర్షాలు లేక సేద్యం సకాలంలో చేయలేకపోయాం. ఈ దఫా వారం రోజలు క్రితం ఓ మోస్తరు వర్షాలు కురవడంతో దుక్కులు చేస్తున్నాం. వచ్చే నెల్లో మంచి వానలు పడితే మినుము, పెసర లాంటి మెట్ట పైర్లు వేసే అవకాశం ఉంది. దీంతో వరుడు దయపైనే ఆశలు పెట్టుకున్నాం.
– దండా రామకృష్ణారెడ్డి, రైతు.
ఎదురు చూస్తున్నాం
వారం రోజులుగా వర్షం పడే విధంగా ఆకాశంలో మేఘాలు కమ్ముకుని ఊరిస్తున్నాయి. ఇటీవల పడిన కొద్దిపాటి వర్షాలకు దుక్కులు సిద్ధం చేసుకుని మరో జల్లు కోసం ఎదురు చూస్తున్నాం. మబ్బుల తీరును చూసి ఇప్పుడు వర్షం పడుతుందని అనుకునే లోపే మేఘాలు గాలులకు ఎగిరిపోతున్నాయి.
– వల్లం బాలయ్య, రైతు, వాకాడు.
వర్షాలు పడితేనే సేద్యం పనులు
వాతారవరణ శాఖ నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ ఏడాది మంచి వర్షాలు పడుతాయనే ఆశ ఉంది. ఇప్పుటికే ఉదయగిరి ప్రాంతంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడినా, గత నాలుగేళ్ల నుంచి వానలు లేక నీరు గంటల వ్యవధిలోనే ఇంకిపోతుంది. ఇంకా మంచి వర్షాలు పడితే సేద్యం పనులు ప్రారంభిస్తాం. ప్రభుత్వం కూడా పచ్చి రొట్ట విత్తనాలు సరాఫరా చేసింది. వాన కోసమే ఎదురు చూస్తున్నాం.
– సుబ్బారెడ్డి, రైతు.
పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం చేశాం
ఖరీఫ్ సాగుకు అదును దాటిపోయి పొలాలు బీళ్లుగా మారాయి. తరువాత సీజన్‌లోనైనా పంటల సాగుకు భూమిలో సారవంతం పెంచేందుకు పచ్చి రొట్టవిత్తనాలు సిద్ధం చేశాం. దుక్కి చేయడానికి పదును లేకపోవడంతో వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. వారం రోజులుగా వాతావరణం చల్లబడి వర్షం పడేటట్లు సూచనలు కనిపిస్తున్నా చినుకు రాలడంలేదు. రోజూ రాత్రిళ్లు రెండు, మూడు చినుకులు పడి అంతటితో సరిపెట్టుకుంటుంది. –మామిడిపూడి వెంకటేశ్వర్లు, రైతు, వాకాడు
Comments
Please login to add a commentAdd a comment