ఇదేందయ్యా బాబూ..! | Luna .. I HOPE! | Sakshi
Sakshi News home page

ఇదేందయ్యా బాబూ..!

Published Mon, Jun 23 2014 2:25 AM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM

ఇదేందయ్యా బాబూ..! - Sakshi

ఇదేందయ్యా బాబూ..!

  •      కోటయ్య కమిటీనివేదిక వచ్చేదెన్నడు?
  •      రుణాల మాఫీపై బాబు నిర్ణయం తీసుకునేదెప్పుడు?
  •      అప్పులపై రైతులకు బ్యాంకర్ల నోటీసులు
  •       ఆందోళనలో జిల్లా రైతాంగం
  • పంట రుణాల మాఫీపై నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి జిల్లా రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రుణాల మాఫీపై విధి విధానాలను రూపొందించడానికి నియమించిన కోటయ్య కమిటీ గడువులోగా ప్రాథమిక నివేదిక ఇవ్వకపోగా, నివేదిక సమర్పించడానికి మరింత సమయం కోరింది. ఈ నేపథ్యంలో రుణాల మాఫీపై బాబు నిర్ణయం వెలువడేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా బ్యాంకర్లు రుణాల మంజూరుకు ముందుకు రాకపోవడంతో జిల్లా రైతాంగం ఆందోళన చెందుతోంది. రుణమాఫీ హామీని నమ్మి గెలిపిస్తే ఇలా చేశారేంటి బాబూ అంటూ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.     
     
    సాక్షి ప్రతినిధి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి షరతులు లేకుండా పంట రుణాలను మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం విదితమే. ఆయన అధికారంలోకి రాగానే రుణాల మాఫీకి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. 12న విశాఖపట్నంలో నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశం అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ 22న కోటయ్య కమిటీ ప్రాథమిక నివేదికను ఇస్తుందని.. 45 రోజుల తర్వాత తుది నివేదిక ఇస్తుందన్నారు.

    తుది నివేదిక అందాక రుణాల మాఫీ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రకటించినట్లుగా ఆదివారం కోటయ్య కమిటీ ప్రాథమిక నివేదికను ఇవ్వలేదు. ప్రాథమిక నివేదిక ఇవ్వడానికి మరి కొంత సమయం కావాలని కమిటీ కోరింది. ఖరీఫ్ ముంచుకొస్తోన్న నేపథ్యంలో చంద్రబాబు ఆదివారం బ్యాంకర్లకు ఎలాంటి ప్రతిపాదనలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
     
    రూ.11,180.25 కోట్లు మాఫీ చేస్తారా..

    జిల్లాలో 7,55,570 మంది రైతులు పంట రుణాల రూపంలో రూ.5,810.84 కోట్లు తీసుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా బంగారు నగలను తనఖా పెట్టి 4,53,162 మంది రైతులు రూ.3,486.50 కోట్లను రుణంగా తీసుకున్నారు. 68,761 మంది రైతులు స్వల్పకాలిక పంట రుణాల రూపంలో రూ.1,129.75 కోట్లను అప్పుగా పొందారు. 45,780 మంది రైతులు వ్యవసాయ పరోక్ష రుణాల రూపంలో రూ.753.16 కోట్లు అప్పుగా తీసుకున్నారు. మొత్తమ్మీద జిల్లాలో రూ.11,180.25 కోట్ల ను బ్యాంకర్లకు పంట రుణాల రూపంలో రైతులు బకాయిపడ్డారు.

    చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు ఆ రుణాలన్నింటినీ మాఫీ చేస్తారని కర్షకులు భావిస్తున్నారు. కానీ.. కోటయ్య కమిటీ కసరత్తు, వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చేస్తోన్న ప్రకటనలను పరిగణనలోకి తీసుకుంటే, ఆ మేరకు రుణాల మాఫీ అయ్యే అవకాశం లేదన్నది స్పష్టమవుతోంది. ఇది రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు పంట రుణాలన్నింటినీ మాఫీ చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
     
    స్పష్టత లేక రైతన్నల నిర్వేదం..
     
    రుణాల మాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో బంగారు నగలను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తున్నారు. కొన్ని చోట్ల బంగారు నగలను వేలం వేయడానికి ప్రకటనలు జారీచేస్తున్నారు. జూలై 3 లోగా రుణాలను చెల్లించకపోతే.. ఆ లోగా రీషెడ్యూలు చేసుకోవాలని రైతులకు బ్యాంకర్లు సూచిస్తున్నారు. ఇదొక పార్శ్వమైతే.. కొత్త పంట రుణాలు పంపిణీ చేయకపోవడం మరొక పార్శ్వం. వరుస కరవుతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్న ఖరీఫ్ పంటల సాగుకు పెట్టుబడుల కోసం దిక్కులు చూస్తున్నారు.

    ఈ ఏడాది రూ.5,323 కోట్లను పంట రుణాలు పంపిణీ చేసేలా బ్యాంకర్లు ప్రణాళిక రూపొందించారు. కానీ.. పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు పంపిణీ చేస్తామని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. రుణాల మాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో కొత్తగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. జిల్లాలో ఏ ఒక్క రైతుకు ఇప్పటిదాకా కొత్తగా పంట రుణం పంపిణీ చేయకపోవడమే అందుకు తార్కాణం. మరో వైపు రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తోండటంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement