ఎంపీ టికెటిస్తే డబ్బులివ్వాలట
అనంతపురం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్టుకు రూ.30 నుంచి రూ.40 కోట్లు, ఎమ్మెల్యే టికెట్టుకు రూ.5 నుంచి రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలంటున్నారని ప్రచారం జరుగుతోందని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. జగన్‌కు ధనకాంక్ష ఎక్కువని ఆరోపించారు. డబ్బుతోనే రాజకీయ మనుగడ సాగించలేమన్నారు.
శనివారం ఆయన ఇక్కడ ఉన్న తన ట్రావెల్స్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రానున్న కాలమంతా ప్రాంతీయ పార్టీలదేనని, కాంగ్రెస్‌ను వీడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. కాంగ్రెస్‌తో బంధం తెంచుకుంటున్నందుకు బాధగానే ఉందని, అయినా తప్పదని అన్నారు. ఇంతవరకు ఏ పార్టీ నేతలతోనూ తాను మాట్లాడలేదన్నారు. సన్నిహితులు, శ్రేయోభిలాషులతో సంప్రదించి వారంలోగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పిచ్చామె అని, ఆమె చేతిలోని రాయిని ఎక్కడ విసిరితే అదే సీమాంధ్ర రాజధాని అని చెప్పారు.
రెండు మూడు నెలలు మాత్రమే సోనియా చేతిలో అధికారం ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైనా, రాష్ట్ర విభజన విషయంలో మొండిగా ముందుకు పోయారని అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పని అయిపోయినట్లేనని తెలిపారు. ఎన్నో పార్టీలు మారిన ఆనం రామనారాయణరెడ్డి లాంటి వారు కూడా తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రం విడిపోయిందని, ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే మళ్లీ సమైక్యాంధ్రగా చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించారు.