ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు (మ్యాక్‌లు) రోగులకు నామమాత్రపు సేవలే అందిస్తున్నాయి. గతంలో అర్బన్ డిస్పెన్సరీలుగా ఉండే వీటిని తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక మ్యాక్‌లుగా మార్పు చేశారు. విశాఖ నగరంతో పాటు అనకాపల్లి, భీమిలిలోనూ వెరసి 24 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇవి ఉదయం 8 నుంచి 12, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఈ ఆస్పత్రుల్లో డెంగ్యూ, మలేరియా, రక్తపోటు, మధుమేహం, కామెర్లు, హిమగ్లోబిన్, సీరం క్రియాటినిన్, లిపిడ్ ప్రొఫైల్, హెచ్‌ఐవీ తదితర 32 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ వీటిపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో ఈ కేంద్రాల సేవలను చాలా మంది వినియోగించుకోలేకపోతున్నారు.
దీంతో ఈ కేంద్రాలు ప్రాథమిక వైద్యానికే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి మూడు నెలలుగా విశాఖ జిల్లా, నగరంలోనూ డెంగ్యూ జ్వరాలు తీవ్రంగా విజృంభిస్తున్నాయి. వేల సంఖ్యలో డెంగ్యూ కేసులు నిర్ధరణ అవుతున్నాయి. ఒక్క కేజీహెచ్‌లోనే ఈ సీజనులో 8,400 మంది డెంగ్యూ అనుమానిత రోగులకు రక్త పరీక్షలు నిర్వహించారు. వీరిలో సుమారు 2,800 మందికి డెంగ్యూగా నిర్ధరణ చేశారు. గడచిన మూడు నెలలుగా ఈ 24 ఆరోగ్య కేంద్రాల్లో కేవలం 500 మంది మాత్రమే డెంగ్యూ పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 25 మందికి డెంగ్యూగా నిర్ధరణ అయింది. అంటే కేజీహెచ్‌కు వెళ్లే డెంగ్యూ రోగులతో పోల్చుకుంటే 6 శాతం మందికి మించడం లేదు. అంతేకాదు.. ఈ ఆస్పత్రుల్లో ప్రాథమిక వైద్యమే అందుతోంది. గతంలో డిస్పెన్సరీల్లో అవసరమైన రోగులకు సెలైన్లు ఎక్కించే వారు. మ్యాక్‌ల్లో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం ఒక్కో మ్యాక్‌లో ఒక ఎంబీబీఎస్ వైద్యుడు, ఒక ల్యాబ్ అసిస్టెంట్, ఒక ఫార్మసిస్టు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక ఆయా విధులు నిర్వహిస్తున్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సదుపాయాలపై జనంలో అవగాహన కల్పించడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు. అక్కడ ఏఏ వైద్య సదుపాయాలున్నాయో కూడా చాలా మందికి తెలియడం లేదు. ఈ కేంద్రాల్లో సిబ్బంది కొరత కూడా వేధిస్తుండడంతో వచ్చే రోగులకు అరకొర సిబ్బంది పూర్తిస్థాయిలో వైద్యం అందించలేకపోతున్నారు. దీంతో అక్కడ తగినంత వైద్యం అందదన్న భావనతో పలువురు కేజీహెచ్‌కు వెళ్లిపోతున్నారు. దీంతో కేజీహెచ్‌పై రోగుల తాకిడి అధికమవుతోంది. అక్కడ వైద్యులకూ భారంగా పరిణమిస్తోంది. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలకు జవసత్వాలు కల్పిస్తే మరింత మంది పేదలకు ఉచిత వైద్యం అందించే వీలుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment