లేటు వయస్సులో ఒక్కటయ్యారు
కుటుంబ బాధ్యతలను నెరవేర్చిన వారిరువురినీ ఒంటరి జీవితం వేధించింది. భార్య దూరమై ఒకరు.. భర్తను కోల్పోయి మరొకరు మానసికంగా కుంగిపోయారు. ఇరువురికీ కూతుళ్లే సంతానం కావడంతో వారి పెళ్లిళ్లతో వీరి బాగోగులు చూసుకునే తోడు లేకపోయింది. ఈ పరిస్థితుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
ఇరువైపుల కుటుంబ సభ్యులు, బంధువుల అంగీకారంతో వారి బంధానికి మూడుముళ్లు పడ్డాయి.శనివారం కోదండరాముడు సాక్షిగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన సుబ్బరంగయ్య(65), సుబ్బలక్ష్మమ్మ(55)లు ఒక్కటయ్యారు. స్థానిక అమ్మవారిశాల వీధికి చెందిన రంగయ్యకు ఇద్దరు కూతుళ్లు . ఇరువురికీ వివాహాలు చేసి అత్తగారిళ్లకు పంపేశాడు. ముప్పై ఏళ్ల కిందట భార్య మృతి చెందడంతో ఒంటరి జీవితం గడుపుతున్నాడు. కంబగిరి వీధికి చెందిన లక్ష్మమ్మ భర్త 20 ఏళ్ల క్రితం మరణించాడు. ఈమెకు ఒక కూతురు సంతానం కాగా.. పదేళ్ల క్రితం వివాహం చేసేసింది. ప్రస్తుతం ఈమె కూడా ఒంటరే. రంగయ్య శనగలను కొనుగోలు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తుండగా.. వాటిని పప్పులుగా మార్చే మిల్లులో సుబ్బలక్ష్మమ్మ కూలీగా పని చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఏడాది క్రితం వీరికి పరిచయం ఏర్పడింది. అభిప్రాయాలూ కలిసాయి. ఇందుకు రంగయ్య కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురు కానప్పటికీ.. లక్ష్మమ్మ అల్లుడు ససేమిరా అన్నాడు. అయితే ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు బలంగా నిర్ణయించుకోవడంతో పెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులందరినీ సమావేశపర్చి అంగీకరింపజేశారు. ఈ మేరకు శనివారం వీరిద్దరూ లేటు వయస్సులో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులతో పాటు విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున దేవాలయం వద్దకు చేరుకుని వెటరన్ వధూవరులను ఆశీర్వదించారు.