సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో ఇసుక మాఫియా మళ్లీ చెలరేగుతోంది. ఎక్కడపడితే అక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇసుక మాఫియా తలదూర్చడంతో ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన నిడ్జూరు, సింగవరం రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ఆగిపోయాయి. ఇప్పటికే తవ్విన ఇసుకను కూడా రవాణా చేయకుండా ఈ మాఫియా నిలవరించడంలో సఫలీకృతమయింది. ప్రభుత్వ రీచ్‌ల నుంచి ఇసుక రవాణా నిలిచిపోవడంతో.. అక్రమ ఇసుకపైనే వినియోగదారులు ఆధారపడాల్సి వస్తోంది.
దీన్ని ఇసుక మాఫియా అవకాశంగా మలచుకుంటోంది. రూ. 4 వేలు ఇస్తేనే ట్రాక్టర్ ఇసుకను సరఫరా చేస్తామని స్పష్టం చేస్తోంది. ఇతర మార్గాల నుంచి సమయానికి ఇసుక వచ్చే అవకాశం లేకపోవడంతో అక్రమ ఇసుకపైనే ఆధారపడుతున్నారు. ఉదాహరణకు ఒక్క కర్నూలు పట్టణానికి ప్రతి రోజూ 400 ట్రాక్టర్ల ఇసుక డిమాండ్ ఉండగా... ప్రభుత్వ రీచ్‌ల నుంచి కేవలం 50 ట్రాక్టర్లే సరఫరా అవుతోంది. మిగిలిన 350 ట్రాక్టర్ల ఇసుక కోసం మాఫియాను ఆశ్రయించాల్సి వస్తోంది.
అక్రమ తవ్వకాలు షురూ...!
ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన నిడ్జూరు, సింగవరం ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలను ఇసుక మాఫియా విజయవంతంగా అడ్డుకోగలిగింది. ఈ రీచ్‌ల నుంచి ఇసుక కొనుగోలు చేసేందుకు మీ-సేవ, బ్యాంకుల్లో డీడీలు కట్టిన వినియోగదారులకు ఇసుక చేరడం లేదు. డబ్బులు చెల్లించి వారం, పది రోజులు గడుస్తున్నా ఇసుక రాకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీంతో ఇసుక రీచ్‌ల వద్దకు వెళ్లి తమకు ఇసుక పంపించాలని కోరుతున్నారు. దీంతో ఇసుక మాఫియా రంగంలోకి దిగుతోంది. ఇక్కడి నుంచి మీకు ఇసుక రావాలంటే అదనంగా డబ్బులు చెల్లించాలని మాఫియా డిమాండ్ చేస్తోంది. ట్రాక్టర్ ఇసుకకు రూ. 4 వేలు ఇస్తేనే ఇసుక వస్తుందని ఇసుకాసురులు తెగేసి చెబుతున్నారు. ఈ తతంగం అంతా స్థానిక ఇసుక రీచ్ అధికారుల సమక్షంలో జరుగుతున్నా ఏమీ చేయలేక చేష్టలుడిగి చూస్తున్నారు. కొద్దిరోజుల్లోనే సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు అంటున్నా వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. గత పది రోజులుగా ఇక్కడి నుంచి అధికారికంగా ఇసుక రవాణా కావడం లేదు. మొదట్లో పోలీసుల బలగాలతో రెండు, మూడు రోజులు ఇసుక రవాణా చేసిన అధికార యంత్రాంగం.. తాజాగా చేతులెత్తేసింది. దీంతో రీచ్ వద్దకు వెళ్లి ఎవరు ఎక్కువ డబ్బు చెల్లిస్తే వారికే ఇసుక రవాణా అవుతోంది. తమకు ఇసుక వస్తుందని ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది.
భారీగా అక్రమ తవ్వకాలు
ఒకవైపు ప్రభుత్వ రీచ్‌ల వద్ద ఇసుక రవాణాను కట్టడి చేస్తున్న ఇసుక మాఫియా.. మరోవైపు అక్రమ తవ్వకాలను తిరిగి ప్రారంభించింది. హంద్రీ నదితో పాటు కుందు నదీ, తుంగభద్ర నదుల్లో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా మునగాలపాడు వద్ద ప్రతి రోజూ రాత్రి సమయంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆదోని ప్రాంతాల్లో కూడా ఇసుక తవ్వకాలను మాఫియా గుట్టుగా చేపడుతోంది. ఈ మొత్తం వ్యవహరం తెలిసి కూడా అధికార యంత్రాంగం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తోంది.
పట్లించుకోని అధికార గణం
వాస్తవానికి ప్రభుత్వ ఆధీనంలో కొత్త రీచ్‌ల ఏర్పాటుకు అనేక అడ్డంకులను భూగర్భగనులశాఖ అధికారులు సృష్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నాగలదిన్నె, తిమ్మందొడ్డితో పాటు జిల్లాలోని అనేక ఇతర ప్రాంతాల్లో కొత్త రీచ్‌ల ఏర్పాటు సాధ్యంకాదని, ఇక్కడ బోర్లు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఈ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేపడితే భూగర్భ జలాలు పడిపోయి బోర్లు పనికిరాకుండా పోతాయనేది వారి వాదన. అయితే, మరోవైపు ఇదే ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు జరిపితే మాత్రం పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ప్రభుత్వ ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలను ఇసుక మాఫియా నిలిపివేసినప్పటికీ అధికార యంత్రాంగం తిరిగి తవ్వకాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవడంలో మౌనం వహిస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏదేమైనప్పటికీ ప్రభుత్వ కొత్త ఇసుక పాలసీతో వినియోగదారులకు మాత్రం ఇసుక ఖరీదైన వ్యవహారంగా మారింది. మరోవైపు ఇసుక మాఫియా మాత్రం యథావిధిగా తన పని తాను చేసుకుంటూ అధిక ధరకు విక్రయిస్తూ లాభపడుతోంది. రెండింటికీ చెడ్డ రేవడిలా ఇసుక పాలసీ మారిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మాఫియా గుప్పిట్లో
Published Sat, Feb 21 2015 2:21 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement