సాక్షి, విశాఖపట్నం : నిత్యావసరాల ధరలు నింగిలో విహరిస్తున్నాయి.. బియ్యం ధరలే కాస్త అందుబాటులో ఉన్నాయనుకుంటే అవీ భారమవుతున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి బియ్యం ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. క్వింటాలుకు రూ.500, పాతిక కిలోల బ్యాగ్‌పై రూ.100కు పైగా పెరిగాయి. సాధారణంగా మార్చి నుంచి బియ్యం ధరలు అందుబాటులో ఉంటాయి. మునుపటికంటే తగ్గుతాయి. ఎందుకంటే.. జనవరితో పంట చేతికొస్తుంది. రైతులు అప్పట్నుంచి ధాన్యాన్ని రెండు నెలల పాటు నిల్వ ఉంచుతారు. వాటిని వ్యాపారులు కొనుగోలు చేసి మిల్లుల్లో మర పట్టించి మార్కెట్‌కు తరలిస్తారు.
ఫలితంగా జులై, ఆగస్టు నెలల వరకు బియ్యం ధరలు కాస్త తగ్గుముఖం పడతాయి. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు బియ్యం ధరలు పెరుగుతున్నాయి. మిల్లర్లు సిండికేట్ అయి బియ్యం సరఫరాలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధాన్యం లభ్యత ఆశించినంతగా లేకపోవడంతో బియ్యం ధరలు పెంచక తప్పడం లేదని మిల్లర్లు చెబుతున్నారు. వాస్తవానికి బియ్యాన్ని ప్రభుత్వానికి లెవీ ఇస్తున్నందున ఆ లోటును భర్తీ చేసుకోవడానికి మిల్లర్లు ధరలు పెంచుతున్నారని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు వేసవికాలంలో ధాన్యం మరపట్టిస్తే నూక ఎక్కువగా వచ్చి బియ్యం దిగుబడి తగ్గుతుందన్నది మరో వాదన. దీన్ని దృష్టిలో ఉంచుకుని కూడా మిల్లర్లు నష్టపోకుండా బియ్యం ధరలు పెంచుతుంటారని అంటున్నారు. కాగా రానున్న రెండు, మూడు నెలల వరకు వీటి ధరల పెరుగుదల కొనసాగవచ్చని, ప్రస్తుతంకంటే ఒకింత ఎగబాకే అవకాశం ఉందని బియ్యం వ్యాపారులు చెబుతున్నారు.
రోజుకు 4 లక్షల కిలోల వినియోగం
విశాఖ నగరంలో రోజుకు సగటున 4 లక్షల కిలోల బియ్యం వినియోగమవుతుందని అంచనా. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రస్తుతం సరుకు మార్కెట్‌కు రావడం లేదు. మిల్లర్ల ముందస్తు వ్యూహంలో భాగంగా సరుకును తగ్గిస్తున్నట్టు చెబుతున్నారు. ఫలితంగా మార్కెట్లో బియ్యానికి డిమాండ్/కృత్రిమ కొరత సృష్టించి, ధర పెరగడానికి దోహదపడుతున్నట్టు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, సరుకులు, కూరగాయల ధరలు భారంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు బియ్యం రేట్లు కూడా వాటితో పోటీపడుతుండడంపై వినియోగదారుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. అధికారులు రంగంలోకి దిగి బియ్యం ధరలను కట్టడి చేయాలని కోరుతున్నారు.
ధరలు తగ్గించకపోతే ఎలా?
ఇప్పటికే మార్కెట్లో పప్పుదినుసులు, నూనెల ధరలు మధ్య తరగతి వారికి భారంగా మారాయి. ఇప్పుడు వాటికి బియ్యం రేట్లు కూడా తోడయ్యాయి. వీటి ధరల పెరుగుదలను నియంత్రించాలన్న ఆలోచన ప్రభుత్వానికి గాని, అధికారులకు గాని కలగడం లేదు. ఎవరుష్టానుసారం వారు రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యులే బాధితులవుతున్నారు. బియ్యం ధరల పెరుగుదలకు కారకులయ్యే వారిపై చర్యలు తీసుకుని కట్టడి చేయాలి.
– కుప్పిలి నిర్మల్‌కుమార్,
చైతన్యనగర్, సీతమ్మధార
Comments
Please login to add a commentAdd a comment