తిరుమలలో మహాసంప్రోక్షణకు రేపే అంకురార్పణ  | Maha Samprokshanam At TTD | Sakshi
Sakshi News home page

తిరుమలలో మహాసంప్రోక్షణకు రేపే అంకురార్పణ 

Published Fri, Aug 10 2018 1:11 AM | Last Updated on Fri, Aug 10 2018 4:22 PM

Maha Samprokshanam At TTD - Sakshi

తిరుమల: శ్రీవారి ఆలయంలో పన్నెండేళ్లకోసారి నిర్వహించే బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈనెల 11న  సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. అనంతరం 12 నుంచి 16 వరకు బాలాలయ మహాసంప్రోక్షణ జరగనుంది. ఈ సందర్భంగా వైకుంఠ నాథుడైన శ్రీవారి ఆలయంలో స్వామి వారికి సుప్రభాత సేవ మొదలుకుని ఏకాంత సేవ వరకు అన్నీ ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అంకురార్పణలో భాగం గా ముందుగా శనివారం రుత్వికుల నియామకం తర్వాత శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా పాత కళ్యాణోత్సవ మండ పంలో ఏర్పాటుచేసిన ప్రాంతంలో 28 కుండలాలు ఏర్పాటుచేస్తారు. ఆ తర్వాత రుత్వికులు, శ్రీవారి ఆలయ అర్చకులు ఆవు పాలు, నెయ్యి, పంచకం, పేడ, పెరుగుతో పంచగవ్య ఆరాధన చేసి పంచప్రాశ్యన స్వీకరణ చేస్తారు. సాయంత్రం అంకురార్పణకు శ్రీకారం చుడతారు. 

ప్రత్యేక టోకెన్ల జారీ నిలిపివేత 
శ్రీవారి దర్శనానికి సంబంధించి వివిధ రకాల దర్శన టోకన్ల జారీని గురువారం అర్ధరాత్రి నుంచే టీటీడీ నిలిపివేసింది. బాలాలయ మహాసంప్రోక్షణ నేపథ్యంలో భక్తులను కట్టడి చేసేందుకు టీటీడీ ఇప్పటికే తిరుమలలో పలు చర్యలు చేపట్టింది. కాలినడక ద్వారా వచ్చే భక్తులకు దివ్యదర్శన టోకన్లను నిలిపివేయగా టైమ్‌స్లాట్‌ దర్శన టోకెన్లను జారీ చేసే కేంద్రాలను మూసివేశారు. అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, ప్రొటోకాల్‌నూ రద్దు చేశారు. అంకురార్పణ రోజున శనివారం 9 గంటలపాటు 50 వేల మందికి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆదివారం నుంచి వీలునుబట్టి రోజుకు 18 వేల నుంచి 30వేల మందికే దర్శనభాగ్యం కల్పించనున్నారు. మహాసంప్రోక్షణ జరిగే 5రోజుల్లో మొత్తం 1,94,000 మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తామని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రకటించారు.

 
ఐదు రోజులు జరిగే కార్యక్రమాలివీ.. 
- 12వ తేదీ ఉదయం యాగశాలలో ఏర్పాటుచేసిన 28 కుండలాలకు శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం నూతనంగా ఏర్పాటుచేసిన యాగశాలకు రుత్వికులు వాస్తు హోమాన్ని వైదికంగా నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో మూలమూర్తికి నిత్యపూజలు నిర్వహించిన అనంతరం యాగశాలలో అగ్నిప్రతిష్ఠ హోమాన్ని నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు శ్రీవారి మూలవిరాట్టులో వున్న శక్తిని కుంభంలోకి ఆవాహన చేస్తారు. అనంతరం కుంభంతో పాటు శ్రీవారి గర్భాలయంలో వున్న ఉత్సవ మూర్తులను యాగశాలకు తరలిస్తారు. దీంతో యాగశాల బాలాలయంగా మారుతుంది. 
13వ తేదీన బాలాలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వామివారి శక్తి వృద్ధి చెందేందుకు పలు హోమాలు నిర్వహిస్తారు. తర్వాత అష్టబంధనకు ఉపయోగించే వస్తువులు, ద్రవ్య పదార్థాలను శుద్ధి, పుణ్యాహవచనం చేస్తారు. దీంతో శ్రీవారి ఆలయంలో మరమ్మతుల పనులు ప్రారంభమవుతాయి. 
14న కూడా గర్భాలయంలో మరమ్మతు పనులు సాగుతాయి. యాగశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. 
15న యాగశాలలో మహాశాంతి హోమగుండంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తరువాత మూలమూర్తిని ఆవాహన చేసిన కుంభాన్ని గర్భాలయంలోకి తీసుకువెళ్ళి 14 కలశాలతో మూలవర్లకు విశేషంగా మహాశాంతి తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే సమయంలో యాగశాలలో ఉన్న ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని రుత్వికులు నిర్వహిస్తారు. 
-16వ తేదీన యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహిస్తారు. అప్పటివరకు యాగశాలలో ప్రత్యేక పూజలు అందుకున్న కుంభాలన్నింటినీ గర్భాలయంతో పాటు ఉప ఆలయాలకు తరలిస్తారు. దీంతో మహాసంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రత్యేకంగా నిర్దేశించిన ముహూర్తం సమయాన ఉ.10.16 గంటల నుండి మధ్యాహ్నం 12 గం టల మధ్య మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కళా ఆవాహనతో కుంభం నుండి మూలవిరాట్టుకు స్వామి వారి శక్తిని ఆవాహనం చేస్తారు. అనంతరం విశేష పూజలు, నైవేద్య సమర్పణ నిర్వహించి చివరిగా బ్రహ్మగోష పఠనంతో మహాసంప్రోక్షణ కార్యక్రమం ముగుస్తుంది.  
17 నుంచి భక్తులకు యాథావిధిగా దర్శనాలు కల్పిస్తారు. అలాగే, వీఐపీ, ప్రోటోకాల్‌ తదితర సేవల దర్శనాలను టీటీడీ ప్రకటిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement