సాక్షి, అమరావతి: పీఠాధిపతులు, స్వామీజీలకు తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో ‘మహా’ అవమానం జరిగింది. వారు ఇప్పటివరకు మహాద్వారం ద్వారా ప్రవేశించి శ్రీవెంకటేశ్వరుని దర్శనం చేసుకునేవారు. అయితే ఇకమీదట స్వామివారి దర్శనానికి సాధారణ భక్తుల మాదిరే వారు క్యూలైన్‌లోనే వెళ్లాలట. తిరుమల ఆలయంలో ప్రముఖులకు నేరుగా మహాద్వారం ప్రవేశంపై చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా జారీ చేసిన సరికొత్త జీవో పెద్ద దుమారం రేపుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజు ఆదివారం సెలవు దినమైనప్పటికీ సీఎం చంద్రబాబు హడావుడిగా ఈ జీవోను జారీ చేయించారు. ఈ జీవోను హిందూ మతపెద్దలు, బ్రాహ్మణ సంఘాలు, అర్చకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాజకీయ పదవుల్లో ఉండే వారందరికీ శ్రీవారి ఆలయ మహాద్వారం గుండా నేరుగా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం తమను విస్మరించడంపై పీఠాధిపతులు, స్వామీజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. పీఠాధిపతులు, స్వామీజీల పట్ల ప్రభుత్వం మహా అపచారం చేసిందని తప్పుపట్టారు.
హడావుడి ఉత్తర్వులు..
తిరుమలలో శ్రీవారి ఆలయ దర్శనానికి నేరుగా మహాద్వారం ద్వారా ప్రవేశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి హడావుడిగా జీవోఎంఎస్ 240 నంబర్ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్, మాజీ రాష్ట్రపతులు, మాజీ ఉప రాష్ట్రపతులు, ఉప ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, సుప్రీంకోర్టు జడ్జిలు, రాష్ట్ర మంత్రులు, మాజీ ప్రధానులు, పదవీ విరమణ చేసిన గవర్నర్లు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు తిరుమల ఆలయ ప్రవేశానికి నేరుగా మహాద్వారం గుండా వెళ్లే గౌరవాన్ని కల్పిస్తూ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. గతంలో ఈ హోదా కల్పించిన వారి జాబితా పూర్తిగా రద్దవుతుందని, తాజాగా పేర్కొన్న జాబితాలోని వారికే మహాద్వార ప్రవేశానికి అవకాశం ఉంటుందని ఇందులో స్పష్టం చేశారు.
తప్పు పడుతున్న పీఠాధిపతులు..
ఈ జాబితాలో పీఠాధిపతులు, స్వామీజీలు లేకపోవడాన్ని హిందూ మతపెద్దలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇప్పటివరకు కొంతమంది పీఠాధిపతులు, స్వామీజీలకు తిరుమలలో స్వామివారి వద్దకు నేరుగా ఆలయ మహాద్వారం గుండా ప్రవేశించే అర్హత ఉందని.. అయితే ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులో ‘రివైజ్డు లిస్టు’ అని స్పష్టంగా పేర్కొనడంతో గతంలో మహాద్వారం గుండా ప్రవేశ అర్హత ఉన్న వారందరూ ఇప్పుడు ఆ అర్హతను కోల్పోయినట్టేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ చర్య పీఠాధిపతులను అవమానించడంగా హిందూ మతపెద్దలు అభిప్రాయపడుతున్నారు. హిందూ ధర్మాన్ని ప్రబోధించే పీఠాధిపతులు, స్వామీజీల పట్ల ప్రభుత్వం అగౌరవం చూపుతున్నదనేందుకు ఇది నిదర్శనమంటున్నారు. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తిరుమల ఆలయంతోసహా రాష్ట్రంలోని ఆలయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం పర్యవేక్షణ అధికారాలు మాత్రమే ఉన్నాయని.. ఆలయాల నిర్వహణ అన్నది ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు. దీనికి భిన్నంగా ఇప్పుడు తిరుమల శ్రీవారి ఆలయంతోసహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో చంద్రబాబు ప్రభుత్వం, అధికారపార్టీ నేతల జోక్యం మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయిందని, తాజా ఉత్తర్వులు ఇందుకు దృష్టాంతమని వారు అభిప్రాయపడుతున్నారు.
స్వామీజీలు చంద్రబాబు తీరును తప్పు పట్టడమే కారణమా?
తిరుపతి తిరుమల దేవస్థానం(టీటీడీ)తోపాటు రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో ప్రభుత్వ జోక్యం పెరగడంతోపాటు ఆలయాల నిధులను నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించడంపై గత ఐదేళ్లుగా పలు సందర్భాల్లో పీఠాధిపతులు, స్వామీజీలు బహిరంగ వేదికలపైనే సీఎం చంద్రబాబు తీరును తప్పుపడుతూ తీవ్ర విమర్శలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో ఏకపక్షంగా 30కిపైగా ఆలయాల్ని ప్రభుత్వం కూల్చివేయడం, గోదావరి పుష్కరాలకు ఆలయాల డబ్బులను పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాలన్నింటినీ సీఎం తన వ్యక్తిగత ప్రచారానికి వాడుకోవడాన్ని వారు నేరుగా తప్పుపట్టారు. దీనిపై మనస్సులో పెట్టుకుని.. కక్షపూరితంగానే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? అని ఈ సందర్భంగా అధికార వర్గాల్లోనే చర్చ జరుగుతుండడం గమనార్హం.
వేరే ప్రాంత పీఠాధిపతులు కోరినా తిరస్కరించి..
అతి ప్రాచీన సంప్రదాయాల్లో ఒకటైన శ్రీవైష్ణవ రామానుజ సంప్రదాయాన్ని అనుసరిస్తున్న జియ్యర్లు, తొండమాన్ చక్రవర్తుల కుటుంబానికి చెందినవారితోపాటు దేశవ్యాప్తంగా 8 మఠాలకు చెందిన పీఠాధిపతులకు, ఆలయ ప్రముఖులైన సన్నిధి గొల్ల, ఆలయ అర్చకులకు మాత్రమే తొలుత తిరుమల ఆలయంలోకి నేరుగా మహాద్వార ప్రవేశం ఉండేదని మతపెద్దలు చెబుతున్నారు. బ్రిటీష్ పాలనలో కొందరు బ్రిటీష్ అధికారులకు సైతం మహాద్వార ప్రవేశం నిరాకరించినట్టు చెబుతారు. ఈ నేపథ్యంలో మహాద్వార ప్రవేశ అవకాశం లేని తమిళనాడుకు చెందిన ఒక పీఠాధిపతి తనకూ ఆలయ మహాద్వార ప్రవేశం కల్పించాలని కోరగా.. టీటీడీ తిరస్కరించినట్టు చెబుతుంటారు. అయితే స్వాతంత్య్రానంతర కాలంలో దశలవారీగా రాజ్యాంగ పదవుల్లో ఉన్న ముఖ్యులు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, రాష్ట్ర సీఎం, సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వంటి వారికి మహాద్వార ప్రవేశ అర్హత కల్పించినట్టు పేర్కొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగ పదవుల్లో ఉన్న మరికొంత మందికీ, మంత్రులు వంటివారికీ అదనంగా జాబితాలో చోటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో అర్హత ఉన్న పీఠాధిపతులు, స్వామీజీలకు ఆ జాబితాలో చోటు కల్పించకపోవడం అధికార వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment