తిరుమలలోని అర్చక నిలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అర్చకులు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ కైంకర్యాలు నిర్వహిస్తున్న నాలుగు ఆర్చక కుటుంబాలకు మనోస్థైర్యాన్ని కల్పిస్తూ వంశపారంపర్య హక్కులను కొనసాగించేలా సీఎం వైఎస్ జగన్ సానుకూల నిర్ణయం తీసుకోవడంపై శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు కృతజ్ఞతలు తెలియచేశారు. అర్చకత్వానికి అర్హులైన తమ కుటుంబాలకు చెందిన దాదాపు 15 మందిని టీటీడీలో అర్చకులుగా నియమించాలని సీఎంను కోరామన్నారు.
దీనిపై స్పందించిన సీఎం తక్షణమే ఈమేరకు చర్యలు చేపట్టాలని టీటీడీకి సూచించినట్లు చెప్పారు. సీఎం సూచన మేరకు తమ కుటుంబాల్లో అర్హులైన వారిని అర్చకులుగా నియమిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. నాలుగు మిరాశీ కుటుంబాలకు చెందిన అర్చకులతో కలసి ఆయన సీఎంను కలసి తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందచేశారు. ఆదివారం తిరుమలలోని అర్చక భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
సీఎం వైఎస్ జగన్‌ను ఆశీర్వదిస్తున్న అర్చకులు
సుపరిపాలన కొనసాగాలి...
రాష్ట్రంలో వేల సంఖ్యలో అర్చక కుటుంబాలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం జీవో 439 జారీ చేసి అర్చకులకు పదవీ విరమణతో పని లేకుండా కైంకర్యాలు నిర్వహించుకునే అవకాశం కల్పించడాన్ని వేణుగోపాల దీక్షితులు స్వాగతించారు. స్వామివారి కృపా కటాక్షాలతో రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అర్చక కుటుంబాలు సీఎం జగన్‌కు అండగా ఉండాలని కోరారు. దివంగత వైఎస్సార్ మాదిరిగానే సీఎం జగన్ అర్చక కుటుంబాలకు ఎంతో మేలు చేశారని వేణుగోపాల దీక్షితులు పేర్కొన్నారు.
అర్చకుల పిల్లలకు రిటైర్మెంట్ వేకెన్సీలలో ఉద్యోగాలు, పెన్షన్, గ్రాట్యుటీ సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంపై అర్చక కుటుంబాల తరపున కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఏఎస్ కృష్ణ శేషాచలం దీక్షితులు, ఏ.గోవిందరాజు దీక్షితులు, సీనియర్ అర్చకులు ఏ.రామకృష్ణ దీక్షితులు, మిరాశీ కుటుంబాలకు చెందిన 14 మంది అర్చకులు ఉన్నారు.
తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేస్తున్న దృశ్యం
నాడు అర్చకులను ఆదుకున్న వైఎస్సార్..
1987లో దేవదాయ చట్టాన్ని సవరించి మిరాశీ అర్చకుల వారసత్వ హక్కులు అప్పటి టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో నాలుగు కుటుంబాలకు చెందిన అర్చకులు వీధుల పాలయ్యారు. అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో దేవదాయ చట్టాన్ని సవరించి నాలుగు కుటుంబాలకు చెందిన అర్చకులు తిరిగి తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చకత్వం చేసుకునేలా అవకాశం కల్పించారు. అప్పటి నుంచి ఈ కుటుంబాలకు చెందినవారిని అర్చకులుగా నియమిస్తూ వస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అర్చకులకు మేలు చేసేలా 2019 అక్టోబరులో జీవో 439 జారీ చేసి అర్చకులకు పదవీ విరమణ వయసును తొలగించి శారీరకంగా ధృఢంగా ఉన్నంతవరకు కైంకర్యాలు నిర్వహించుకునే అవకాశం కల్పించారు. తద్వారా వేల సంఖ్యలో అర్చక కుటుంబాలను ఆదుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment