పనుల్లో నిమగ్నమైన వేతనదారులు
- ఇకపై పని చేసిన గ్రామంలోనే సగం నిధులు ఖర్చు చేయాలి
- వేతనదారులకు పని కలిపిస్తేనే మెటీరియల్ పనులు మంజూరు
- ఈ ఏడాది జిల్లాలో రూ. 800 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది నుంచి మార్పులు తీసుకురావాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. గ్రామాల్లో వేతనదారుల ద్వారా జరిగే పని విలువను బట్టే ఆ గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు ఉపయోగపడే మెటీరియల్ కాంపోనెంట్ నిధులను మంజూరు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల్లో కొన్ని మార్పులు చేయనున్నారు. ఉపాధి çహామీ పథకం అమలు చేసేందుకు రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధుల్లో 60 శాతం వేతనదారులకు పనులు కల్పించడానికి, మరో 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ పనుల్లో భాగంగా సిమెంటురోడ్లు, భవనాలు, సీసీ కాలువులు, ప్రహరీల నిర్మాణ పనులకు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.
ప్రస్తుతం 40 శాతం మెటీరియల్ పనుల నిధుల విడుదలకు జిల్లా ప్రాతిపదిక.. గ్రామాల్లో వేతనదారుల ద్వారా జరిగే పని విలువను బట్టీ నిధులు విడుదల చేసే వెసులుబాటు ఉంది. కొత్త నిబంధనల ప్రకారం.. గ్రామ పరిధిలో వేతనదారుల ద్వారా చేసే పని విలువలో కనీ సం 50 శాతం సంబంధిత గ్రామంలోనూ, మరో 25 శాతం నిధులు ఆ గ్రామం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వేరే గ్రామానికైనా మంజూరు చేయవచ్చు. మిగిలిన 25 శాతం నిధులను ఆ జిల్లా పరిధిలో ఏ గ్రామానికైనా మంజూరు చేసే వెసులబాటు ఉంది. ఇటీవల జరిగిన రాష్ట్ర ఉపాధి హమీ పథకం అమలు కమిటీ సమావేశంలో గ్రామీణ అభివద్ది శాఖ అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు చేయగా..దీనికి ప్రభుత్వం అంగీకరించింది. అధికార ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంది.
రూ. 800 కోట్ల విలువైన పనుల లక్ష్యం
జిల్లాలో ఈ ఏడాది (2018–19 ఆర్థిక సంవత్సరంలో) ఉపాధి హమీ పథకం ద్వారా 800 కోట్ల రూపాయల విలువ చేసే వివిధ పనులు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వేతనదారుల ద్వారా చె?పట్టే పనులకు నాలుగు వందల కోట్ల రూపాయలు, మెటీరియల్ పనులకు మరో రూ. 400 కోట్లు వెచ్చించాలనేది లక్ష్యం. వీటిలో మెటీరియల్ కంపోనెంట్ పనుల్లో ఉపాధి హామీ పథకం ద్వారా సమకూరే నగదు రూ. 266 కోట్లు కాగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.134 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం, నిబంధనాలతో వేతనదారులు ఎక్కువగా పనిచేసే గ్రామాల్లో మెటీరియల్ కాంపోనెంట్ పనులు కూడా ఎక్కువగా రానున్నాయి.
గత ఏడాది జిల్లాలో వేతనదారులు రూ. 320 కోట్లు విలువైన పనులు చేయగా.. మెటీరియల్ పనులు రూ. 210 కోట్లు జరిగాయి. ఈ ఏడాది ఈ మొత్తాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాలో 1096 పంచాయతీలు ఉండగా.. వీటిలో 1071 పంచాయతీల పరిధిలో ఉపాధి పనులు జరుగుతున్నాయి. మిగిలిన 25 గ్రామాల్లో పనులు గుర్తించక పోవడంతో పాటు వేతనదారులు కూడా పనులు చేసేందుకు ఆకస్తి చూపడం లేదు. ఇలాంటి గ్రామాల్లో నీటి గుంతలు, గృహ నిర్మాణాలు ఇతర పనులు చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరేలా కృషి చేస్తున్నామని పీడీ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకి సగటునా 2,75,000 మంది వేతనదారులు పనుల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment